* పోలవరంపై బీజేపీ ఫోకస్
త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు మంజూరు చేశామన్నారు.కేంద్ర ఇచ్చే నిధులతో జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేశామని పురంధేశ్వరి తెలిపారు.
* విజయోత్సవ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల
యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు తెదేపా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సభకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఎన్నికల శంఖారావం పూరించే సభగా విజయోత్సవ సభను అభివర్ణించారు. సభకు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. విజయోత్సవ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేద్దామనుకున్నామని.. అయితే, ఇది యువగళం సభ అయినందున ప్రకటించడం లేదని చెప్పారు. త్వరలోనే తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కలయికతో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెదేపా ప్రత్యేక రైళ్లను సైతం ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమై తర్వాతి రోజు విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
* తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నారైలు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.సీఎం మర్యాదకరంగా మాట్లాడుతారని అనుకున్నాను. కొన్ని ఊహించలేం.. ఎందుకంటే అది కొంతమందికి సాధ్యం కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ అని ఏకవచనంతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని పట్టుకుని గారు గారు అని మాట్లాడినప్పుడే వారి సంస్కారం, పరిజ్ఞానం అర్థమైంది. అచ్చొసిన ఆంబోతు ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఎవరు అచ్చొసిన ఆంబోతు. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. కాంగ్రెస్ పార్టీలో మా భట్టన్నా.. శ్రీధరన్నా.. దామోదరన్నా, ప్రభాకరన్నా, ఉత్తమన్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డన్నా.. వీరంతా కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన.. చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎన్నారైలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని సీఎం అన్నారు. మరి ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు..? అని కేటీఆర్ నిలదీశారు.కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దామోదర రాజనర్సింహా స్పందించారు. కేటీఆర్ ప్రసంగానికి అడ్డుపడిన ఆయన.. పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేం హైకమాండ్‌కు అప్పజెప్పుతాం. హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి శిరసావహిస్తాం. అది మేం పాటిస్తాం అని దామోదర రాజనర్సింహ చెప్పారు.మళ్లీ కేటీఆర్ మాట్లాడుతూ.. మేం చెప్పింది అదే.. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు.. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్పాను. మీరు చెప్పిందే తాను చెప్పానని కేటీఆర్ అన్నారు. ఎన్నారైల పట్ల సీఎంకు ఉన్న ప్రేమను ఎన్నారైలు గమనించాలి అని కోరుతున్నా. వందల కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం వాళ్లను తీసుకొచ్చి అధ్యక్షులను చేసుకున్నది ఎవరు..? ఈ దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడితే ఎట్ల..? అని కేటీఆర్ విమర్శించారు.
* గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర బీజేపీ ఎంపీ సీరియస్
కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పులో ఉందని ఇప్పుడు చెబుతున్నారని, తెలంగాణ అప్పుల్లో ఉందని తెలిసే కదా వారు ఆరు గ్యారంటీలిచ్చిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు నిధులకు ఎలా తెస్తారో స్పష్టత లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ఓటు బ్యాంకులో చీలిక రావడం వల్లే కాంగ్రెస్ లాభపడింది తప్పితే ఆ పార్టీ బలపడలేదని ఆయన విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని, గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారంటీల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవని లక్ష్మణ్ పేర్కొన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన అన్నారని, మరి ఏమైందని ఆయన ప్రశ్నించారు. అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ ఎన్నికలపై కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని, దీనిపై అధిష్టానం చెప్పిన దాన్ని తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని, ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం భారం ఇతర వర్గాలపై పడిందని, కొందరు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారిని ఆదుకోవాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. వారికోసం తీసుకుంటున్న చర్యలేంటో కాంగ్రెస్ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆర్టీసీ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, దీనిపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌కు వంద రోజులు గడువిస్తున్నామని, అప్పటికీ అమలుచేయకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
* కేరళలో కరోనా న్యూ వేరియంట్
కేరళలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో JN.1 (జేఎన్.1) వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధికంగా ఉంటున్నాయి. కేరళలో నవంబర్ నెల మొత్తం 470 కరోనా కేసులు నమోదు కాగా.. డిసెంబర్ నెల తొలి పది రోజుల్లోనే 825 మంది కరోనా బారినపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1104కు పెరిగింది.కొత్త వేరియంట్ కారణంగా కేరళలో కరోనా కేసులు పెరగడం దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం అవుతున్నది. దాంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 31 తర్వాత దేశంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో మొత్తం 17,605 మందికి పరీక్షలు నిర్వహించగా 312 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కు చేరింది.కాగా, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర కోట్లు దాటింది. అందులో 98 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తం 5,33,310 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే దేశంలో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం కరోనా టీకాల సంఖ్య 220.67 కోట్లకు చేరుకున్నది.
* కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తోన్న అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. కేంద్రం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోన్న తెలుగు భక్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
👉 – Please join our whatsapp channel here –