రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కొనసాగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. భక్తుల రద్దీ దృష్ట్యా జాతర పూర్తయ్యేంత వరకు ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు వివరించారు. శుక్ర, శనివారాల్లో ‘సమ్మక్క సారలమ్మ’ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం, అన్నపూజల మొక్కులు చెల్లించుకునేందుకు టికెట్లు జారీ చేస్తామన్నారు. మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని, ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఈవో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –