* లేఆఫ్‌లపై స్పందించిన సుందర్ పిచాయ్
మాంద్యం భయాల నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో పెద్దఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సైతం ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అయితే తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో లేఆఫ్‌లపై అడిగిన ప్రశ్నకు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. కంపెనీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.‘శ్రామిక శక్తిని తగ్గించడానికి లేఆఫ్ లాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని దాదాపు సంవత్సరం కానుంది. ఈ నిర్ణయంతో కంపెనీ వృద్ధి, లాభ, నష్టాలపై ఎలాంటి ప్రభావం చూపిందని భావిస్తున్నారు’ అని మంగళవారం నిర్వహించిన సమావేశంలో పిచాయ్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి పిచాయ్ బదులిస్తూ.. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని, భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ లేఆఫ్ దిశగా అడుగులు వేసిందని పేర్కొన్నారు.‘ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఏ కంపెనీకైనా కష్టం. గత 25 ఏళ్లలో మేం ఇలాంటి సందర్భాన్ని చూడలేదు. ఆ సమయానికి లేఆఫ్ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు మరింత కష్టంగా మారేవి. అయినా ఉద్యోగులను తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం’’ అని పిచాయ్ అన్నారు. ఉద్యోగులను ఇలా తొలగించడం సరైన పద్ధతి కాదు, దీన్ని కొంచెం భిన్నంగా చేయాల్సి ఉందని తాను భావించానని పిచాయ్ పేర్కొన్నారు.
* సంఖ్యల ఆధారంగా పనితీరును అంచనావేయద్దు!
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త కంపెనీలు దేశీయంగా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అయితే, కంపెనీల పనితీరు కేవలం సంఖ్యల ఆధారంగా మాత్రమే ఉండకూడదు, అవి దీర్ఘకాలం కొనసాగడంపై దృష్టి పెట్టేలా ఉండాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ కమలా కాంతరాజ్ అన్నారు. సంస్థ పనితీరును కొలవడంలో మార్పు రావాలి. ఇప్పటికే ఈ కొలమానం కారణంగా కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ రోజు మంచి పనితీరును కనబరచిన సంస్థలు కూడా ఒక్కోసారి బాగా రాణించకపోవచ్చు, అయినా కూడా పర్వాలేదు. ఒడుదొడుకులను తట్టుకుని నిలబడితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఆశించవచ్చని బీఎస్ఈ చీఫ్ తెలిపారు.కంపెనీ తమ షేర్ ధరపై కూడా ఆందోళన అవసరం లేదని, కంపెనీ, ప్రభుత్వ పనితీరు బాగంటే షేర్ హోల్డర్స్ కంపెనీకి తోడ్పాటు అందిస్తారని అన్నారు. సంస్థలు పారదర్శకతను ప్రోత్సహించాలి. దాని ద్వారా పెట్టుబడులు కూడా పెరుగుతాయని కమలా కాంతరాజ్ పేర్కొన్నారు.
* ఓలా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
ప్రముఖ విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola electric) ఇయర్ ఎండ్ ఆఫర్లు తీసుకొచ్చింది. ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air), ఓలా ఎస్1 ఎయిర్ ప్రో (S1 Pro) కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటూ ఓలా ఎస్1 ఎక్స్+ (Ola S1 X+)పై రూ.20వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఆఫర్ ప్రారంభం కాగా.. డిసెంబరు 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 శ్రేణిలో.. ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో పేరిట తీసుకొచ్చిన రెండు స్కూటర్లపై రూ.5వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌కు అదనంగా ఐదేళ్ల బ్యాటరీ వారెంటీని ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ సాయంతో కొనుగోలు చేసిన వాళ్లు అదనంగా రూ.5వేలు డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది. ఈ రెండు ఆఫర్లతో కలిపి మొత్తం రూ.10వేల వరకు తగ్గింపు పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా వీటి కొనుగోలుపై జీరో డౌన్ పేమెంట్ ఛార్జీ, జీరో ప్రాసెసింగ్ ఫీ వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది.
* జ్యుయెలరీ స్టోర్‌ను ప్రారంభించిన నటి కాజల్
ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్‌క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లిలోని PNR ఎంపైర్‌లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభమైంది. ఈ జ్యుయెలరీ స్టోర్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో డైమండ్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు, చెవి పోగులు, ఉంగరాలు సహా మహిళలు, పురుషుల కోసం బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయి. ఈ స్టోర్‌ను ఆధునిక హంగులతో కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయెలరీ’తో అనుబంధం ఏర్పడటం, హైదరాబాద్‌లో వారి అతిపెద్ద స్టోర్‌ను ప్రారంభించడం నాకు గొప్ప గౌరవం. దేవి పవిత్రలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. ఈ స్టోర్‌లో సంప్రదాయ ఆభరణాల నుంచి ఆధునిక డిజైన్ల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పింది.దేవీ పవిత్ర గోల్డ్ & డైమండ్స్ డైరెక్టర్స్ మాట్లాడుతూ.. దేవి పవిత్ర గోల్డ్ & డైమండ్స్ జ్యుయెలరీలోని ఆభరణాలు అత్యంత నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయని చెప్పారు. ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించడంలో నైపుణ్యం కలిగిన కళాకారులు వీటిని తయారు చేశారు. ఈ స్టోర్ కస్టమ్ జ్యుయెలరీ డిజైన్ సేవలను కూడా అందిస్తుంది.
* ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం
ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసాన్ని వాడటంపై ఇటీవల విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ ఆహార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై కంపెనీలు ఇథనాల్ తయారీలో చెరకు రసం, బీ-హెవీ మొలాసిస్‌ను రెండింటిని ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు దేశీయ మార్కెట్లో తగినంత చక్కెర సరఫరాను అందించడానికి, ధరలు అదుపులో ఉంచడానికి ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం, బీ-హెవీ మొలాసిస్‌ను వినియోగించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వెనక్కి తీసుకోవాలని కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో తాజాగా ఆహార మంత్రిత్వ శాఖ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుత 2023-24 సంవత్సరంలో 17 లక్షల టన్నుల వరకు చెరకు రసం, మొలాసిస్ రెండింటినీ ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –