పరమేశ్వరుడిని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే… ఇక్కడ మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగవైభవంగా నిర్వహించే కల్యాణంలో, జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం విశేషం.
సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అదీ ఒక్క రాత్రిలో నిర్మించారని కథ. వెయ్యి సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం, మల్లన్నపేట గ్రామంలో కనిపిస్తుంది. భక్తుల కోర్కెలను తీర్చే బోళాశంకరుడు దొంగమల్లన్నగా కొలువైన ఈ ఆలయంలో… ఏటా మార్గశిరంలో నిర్వహించే జాతరను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.
స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించినా ఆవుల రంగు మారిపోవడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్కరాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఈ విషయం ఊరివాళ్లకు తెలియడంతో స్వామిని దొంగమల్లన్నగా పిలవడం మొదలుపెట్టారని కథనం. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ ఇక్కడున్న శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన స్వామికి బోనాలు సమర్పించి… పట్నాలు వేస్తే (ప్రత్యేకంగా వేసే రంగవల్లికలు) కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
వైభవంగా జాతర…
ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజూ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి, కార్తికంలో విశేషమైన పూజా కార్యక్రమాలూ ఉంటాయి. ఇవి కాకుండా… మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమినాడు స్వామికి అంగరంగ వైభవంగా కల్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి… ఆ మర్నాటి నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పటినుంచి ప్రతి ఆది, బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకూ కొనసాగుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆ సమయంలో శివసత్తుల పూనకాలు, ఒగ్గుకళాకారుల ప్రదర్శనలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. పండుగ వాతావరణాన్ని తలపించే ఈ జాతరలో భక్తులు తెల్లవారు జామునే ఆలయానికి చేరుకుని కొత్త పంటతో కొత్త కుండలో బోనం తయారుచేసి డప్పు చప్పుళ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తరువాత స్వామికి నివేదిస్తారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ఆ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, సిద్ధిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. చివరగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, చండీహోమం, పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఆలయంలో స్వామితోపాటు గణపతి, నాగదేవత, భైరవుడు, జగన్మాత.. వంటి దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు
దొంగమల్లన్న ఆలయం జగిత్యాల పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాలకు చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో జగిత్యాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. రైల్లో రావాలనుకునే భక్తులు హైదరాబాద్ నుంచి కాజీపేట లేదా వరంగల్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో కరీంనగర్ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు.
👉 – Please join our whatsapp channel here –