DailyDose

విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక

విద్యార్థులకు యూజీసీ హెచ్చరిక

విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను (Online Degree Courses) అందిస్తున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు, కళాశాలలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) (UGC) హెచ్చరించింది. వీటికి కమిషన్‌ గుర్తింపు ఇవ్వబోదని పునరుద్ఘాటించింది. విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘అనేక ఉన్నత విద్యా సంస్థలు, కాలేజీలు కమిషన్‌ చేత గుర్తింపులేని మధ్యవర్తుల సహకారం ద్వారా విదేశీ సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి వారి చర్యలకు యూజీసీ ఆమోదం లేదు. వీరు విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు చట్టరీత్యా చెల్లుబాటు కావు’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి అన్నారు. కొన్ని ఎడ్‌టెక్‌ కంపెనీలు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి డిగ్రీ, డిప్లొమా కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తామంటూ వార్తాపత్రికలు, సోషల్‌మీడియా, టెలివిజన్‌లలో ప్రకటనలు ఇస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ‘అటువంటి ఫ్రాంఛైజీల ఏర్పాట్లకు అనుమతి లేదు. వారిచ్చే పట్టాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండదు. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న అన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జోషి వివరించారు. విద్యార్థులు, ప్రజలందరూ వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి కోర్సుల్లో చేరే వారు వ్యక్తిగతంగా వారికి వారే బాధ్యులని యూజీసీ కార్యదర్శి స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z