‘పేదప్రజల చెమట వాసనను భరించలేనని చాటి చెప్పిన ప్రగతిభవన్ గేట్ల ముందున్న ఇనుప కంచెలను బద్దలుకొట్టి ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తుంటే భారాస భరించలేకపోతోంది. కుటుంబపాలనకు ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారం చేసిన గంట వ్యవధిలోనే ప్రగతిభవన్ అడ్డుగోడలను తొలగించిన చరిత్ర మా పార్టీది. ప్రజాతీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్లను ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వం అబద్ధాలతో అన్ని విషయాల్లో గొప్పలు చెప్పుకొంది. పలు రంగాల్లో దేశంలోనే అగ్రస్థానం సాధించామంటూ వాళ్లు చెప్పినవన్నీ అవాస్తవాలు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విపక్ష భారాసను దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చకు అసెంబ్లీ, మండలిలో సీఎం సమాధానమిచ్చారు.
‘‘ఏందిరా ఏందిరా తెలంగాణం.. ఎలా మూగబోయింది జనగానం’’.. అంటూ అందెశ్రీ కవిత్వంతో ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పుతోనైనా సభలో ప్రతిపక్షం తరఫున ఇతరులెవరికైనా మాట్లాడే అవకాశమొస్తుందని ఆశించా. కానీ ఆ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని తేలింది. సీనియర్ శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రులుగా పనిచేసినవారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కేసీఆర్ కుటుంబసభ్యులే చర్చను ప్రారంభించారు.
ప్రగతిభవన్ ఎదుట అవమానాలు
గత ప్రభుత్వంలో సాక్షాత్తూ హోంమంత్రి మహమూద్ అలీ.. ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్‌కు వెళ్తే హోంగార్డు ఆయనను ఆపివేసి అవమానించిన ఘటన చరిత్రలో నిక్షిప్తమై ఉంది. ఆనాటి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి ఈటల రాజేందర్ వెళ్తే.. మీకు ఆ స్థాయి లేదంటూ పోలీసులు ఆపేశారు. 50 ఏళ్లపాటు గజ్జెకట్టి తన పాటతో కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్‌ను.. ప్రవేశం లేదంటూ గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. అలాంటి ప్రగతిభవన్ కంచెలను బద్దలుకొట్టి.. ప్రజలు ఎప్పుడు కావాలన్నా ప్రవేశం కల్పించిన ప్రభుత్వం మాది. మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన వాళ్లకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? క్యాబినెట్‌లో నిర్ణయించిన ఆరు గ్యారంటీలనే గవర్నర్ ప్రసంగంలో చేర్చాం. ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. గోదావరి, కృష్ణా జలాలు, అవుటర్ రింగ్‌రోడ్డు, మెట్రో, విమానాశ్రయం, తీగల వంతెన ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగినవే. తెదేపా నేత దేవేందర్‌గౌడ్ పాదయాత్ర చేస్తే రూ.34 వేల కోట్లతో ప్రాణహిత- చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
అమరుల కుటుంబాలను విస్మరించారు
రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్య, యాదిరెడ్డి లాంటి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. మీ పాలనలో వారి కుటుంబ సభ్యులను ప్రగతిభవన్‌కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా? చట్టసభల్లో వారికి కనీస స్థానం కల్పించారా? కొడుకును, అల్లుడిని, కండువా మార్చి వచ్చిన వారిని మంత్రులుగా చేసుకున్నారు. తెలంగాణ కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళినికి న్యాయం చేయలేదు కానీ, నిజామాబాద్‌లో ఓడిపోయిన వెంటనే బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చారు మీ నాయకుడు. నిరుద్యోగులు, విద్యార్థులపై ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కూడా ఎందుకు తొలగించలేదు? ఉద్యమ పార్టీ అని చెప్పే మీరు.. ధర్నాచౌక్‌ను ఎందుకు తొలగించారు? దాన్ని మేం పునరుద్ధరిస్తున్నాం. సభలో అడ్డుపడటం కాదు. ధర్నాచౌక్‌లో కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. ఇప్పుడు మాకు స్వేచ్ఛ వచ్చిందని మీ ఎమ్మెల్యేలే కొందరు చెబుతున్నారు.
రైతు బతికుండగా సాయం చేయకుండా..
రైతు ఆదాయపరంగా దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన సమాచారం ఇది. తెలంగాణలో రైతు తలసరి ఆదాయం రూ.9403. రూ.29,348తో మేఘాలయ ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణలో గత పదేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ పదో స్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది. గత ప్రభుత్వం రైతుబీమా కింద 18-60 ఏళ్లలోపు ఉన్న రైతులు బీమాకు అర్హులని ప్రకటించింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు పెట్టుబడి పెట్టి.. కరవు, చీడపీడలతో పంటలు చేతికిరాక ఎంతో మంది చనిపోయారు. పంటల బీమా పథకం పెట్టి ఉంటే రైతులు చనిపోయేవారా? బతికి ఉన్నప్పుడు సాయం చేయకుండా చనిపోయాక రూ.5 లక్షలిస్తే రైతు బతికి వస్తాడా?
వాణిజ్యపంటలు కనుమరుగు
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పసుపు, చెరకు, మినుము, సోయా, కందులు వంటి వాణిజ్య పంటలు కనుమరుగయ్యాయి. కేవలం వరి మాత్రమే వేసే స్థాయికి రైతులను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరి వేస్తే ఉరే అని ప్రకటించి.. కేసీఆర్ ఫాం హౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. రైతులు పండించిన ధాన్యాన్ని క్వింటాలుకు రూ.1400కు దళారులు కొనుగోలు చేస్తూ క్వింటాకు 10 కిలోలు దోచుకుంటుంటే వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? మరోవైపు ఫాంహౌస్‌లో పండిన వరిని క్వింటాలుకు రూ.4252కు విక్రయించారు. దీనిపై విచారణకు ఆదేశిస్తా. మీరు సిద్ధమా? భారాస నాయకులు చెప్పినట్లు.. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో కాదు.. పదో స్థానంలో ఉంది. 12,250 తలసరి యూనిట్ల వినియోగంతో దాద్రా-నాగర్‌హవేలీ మొదటి స్థానంలో ఉంది. దమణ్-దీవ్, గోవా, ఒడిశా, పుదుచ్చేరి ప్రాంతాలు తెలంగాణ కన్నా ముందున్నాయి. ఇప్పటికైనా భారాస అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.
అవి భారాస సిగ్గుపడాల్సిన అంశాలే..
గవర్నర్ ప్రసంగంపై సిగ్గుపడాల్సి వస్తోందని కేటీఆర్ అన్నారు. నిజమే.. అందులో భారాస నాయకులు సిగ్గుపడాల్సిన చాలా అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో జరిగిన ఇసుకదోపిడీలో భారాస నాయకులు లేరా? నేరెళ్లలో ఇసుక లారీలు దళితులను తొక్కి చంపుతుంటే అడ్డుపడినందుకు వారికి కరెంట్‌షాక్ పెట్టి సంసారానికి పనికిరాకుండా చేశారు. లోక్‌సభ స్పీకర్ దళితులను పరామర్శించడానికి వస్తే పోలీసులతో అడ్డుకున్నారు. రైతు రాజ్యం అని చెబుతూ.. ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించిన రైతులకు.. అందునా చంటి పిల్లలున్న మహిళలకు బేడీలు వేసిన చరిత్ర మీది.
పల్లీ పొట్లాల్లా ప్రశ్నపత్రాల విక్రయం
వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలను పల్లీ పొట్లాల్లా విక్రయించారు. ఇంటర్ ప్రశ్నపత్రాల రూపకల్పనను మీకు అనుకూలమైన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో అవకతవకలు చోటుచేసుకుని 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందో తెలియదా. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించారు. పైగా మేమే లీకేజీ బయటపెట్టామని మీరు చెబుతున్నారు. పంపకాల్లో తేడాలు రావడంవల్లే విషయం బయటకు పొక్కింది. మీ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు బలైపోయారు. పాఠశాల విద్యలో మన రాష్ట్రం 31వ స్థానంలో ఉందని స్కూల్స్ ఆఫ్ నేషన్ అచీవ్‌మెంట్ సర్వే చెబుతోంది.
అప్పుడు కృతజ్ఞతలు.. ఇప్పుడు దూషణలా?
ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగనందునే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ముందు నడిచింది. కోదండరాం నాయకత్వలో మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మెకు సహకరించిన పార్టీల్లో కాంగ్రెస్ ముందు ఉంది. కరీంనగర్ నుంచి సోనియా గాంధీ రాష్ట్రం ఏర్పాటుకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఇదే సభలో ప్రస్తావించి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ను దూషిస్తారా? తెలంగాణ వచ్చాక.. కేసీఆర్ కుటుంబ సమేతంగా దిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిశారు. చివరికి వెన్నుపోటు పొడిచారు. అయినా సోనియా ఇప్పటి వరకు ఒక్కమాట కూడా అనలేదు.
మత్తు లేని తెలంగాణ లక్ష్యం
పంజాబ్‌లా మాదక ద్రవ్యాలతో ఆగం కాకుండా భద్రమైన తెలంగాణగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాష్ట్రంలో గత ప్రభుత్వం కేవలం కాగితాలపైనే టీఎస్ న్యాబ్‌ను ఏర్పాటు చేసింది. సీవీ ఆనంద్‌కు అదనపు ఛార్జి మాత్రమే ఇచ్చింది. 301 మంది సిబ్బంది, రూ.29 కోట్ల బడ్జెట్ కావాలని అడిగితే పట్టించుకోలేదు. మేం ఇప్పుడు ప్రత్యేకంగా డీజీని నియమించాం. నిధులూ ఇస్తాం. మత్తు పదార్థాలను రాష్ట్రం నుంచి తరిమేస్తాం. ఆ దందాలో ఎంత పెద్దవాళ్లున్నా.. జైల్లో వేస్తాం’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కోటి ఎకరాల సాగు ఎక్కడ?
రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాలువల నీళ్లు ఇచ్చి ఉంటే.. తెలంగాణ ఏర్పడినప్పుడు 19 లక్షలుగా ఉన్న పంపుసెట్లు 29 లక్షలకు ఎలా పెరిగాయి? రూ.లక్షల్లో ఖర్చు చేసి కాళేశ్వరం నీళ్లు ఇచ్చారనేది శుద్ధ అబద్ధం. కొడంగల్, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి ఉంటే వలస బతుకులు మారేవి. సమైక్య రాష్ట్రంలో వివక్ష చూపడం వల్లే కొట్లాడాం. 2014 తరువాత తెలంగాణ బిడ్డే కదా పాలనలో ఉన్నది. ప్రాణహిత- చేవెళ్ల పథకం ఎందుకు ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వివక్ష ఎందుకు చూపారు? కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను ఎందుకు మూలకుపెట్టారు? 2013లో సమైక్య ప్రభుత్వం చివరి జీవో 69 కింద 8.5 టీఎంసీల నికర జలాలతో రూ.1500 కోట్లతో కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టును మంజూరు చేస్తే కేసీఆర్ సీఎం అయ్యాక దాన్ని తొక్కిపెట్టి ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి.. మా ప్రాంతంపై వివక్ష చూపారు. కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరు వస్తే కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించాం. అయినా, ఆర్డీఎస్ పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేదు.
👉 – Please join our whatsapp channel here –