* బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ
రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
* తప్పులన్నీ సరిచేస్తాం
నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యాశ, అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములు ఇచ్చిన వేల మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృథా కాదని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు.
* తొలిసారిగా ములుగు నియోజకవర్గానికి సీతక్క
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka). ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా మహ్మద్ గౌస్ పల్లి వద్ద ఆమెకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అక్కడి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు 15 కి.మీ.ల మేరు ఆమె ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. గట్టమ్మను దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మేడారం(Medaram) వెళ్లారు. మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటన సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. “నేను ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. గ్రామాలాభివృద్ధికి కృషి చేసి నా శాఖకు వన్నెతెస్తా. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలు మాత్రమే అభివృద్ధి చెందాయి.రాబోయే కాలంలో కేంద్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి” అని అన్నారు
* ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారన్నారు. హైదరాబాదులో ఉన్న నా ఓటును రద్దు చేసుకున్నానని తెలిపిన నాగబాబు.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు.తాను నెల్లూరునే చదువుకున్నానన్న నాగబాబు.. జనసేన ఆవిర్భావం తర్వాత పలుమార్లు నెల్లూరుకు వచ్చానన్నారు. రాజకీయ పదవుల మీద ఆసక్తి, కోరిక, ఆలోచన లేదన్నారు. కేవలం జనసేన కార్యకర్తలలో స్ఫూర్తిని నింపేందుకే పనిచేస్తున్నామన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు సంబంధించి ఒక కామెడీ మ్యాగజైన్ ఉందని.. అందులో తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాశారని.. ఓటును మార్చుకుందామని భావించానన్నారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందజేశామన్నారు. అది పరిశీలనలో ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని నాగబాబు వెల్లడించారు. ఏ నియోజకవర్గమనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారన్నారు. మా అమ్మది నెల్లూరు.. నెల్లూరుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నానని నాగబాబు స్పష్టం చేశారు.
* త్వరలో మేడిగడ్డకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కూలిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మెడిగడ్డ పిల్లర్ల అంశాలపై ఈ.ఏన్.సి మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో రెండోసారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మేడిగడ్డకి వెళ్లనున్నట్లు సమాచారం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై పారదర్శక విచారణకి అదేశిస్తామని నిన్న కౌన్సిల్ లో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వాటి వెనుక మంత్రులు ఎవరు..? అధికారుల పాత్రతో సహా అన్నింటినీ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడం తమ పని కాదని మేడిగడ్డ నిర్మాణ సంస్థ పేర్కొంది. మేడిగడ్డలో బ్యారేజీ కూలిపోవడంతో పాటు దెబ్బతిన్న పైర్లను పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు అనుబంధ ఒప్పందం కుదిరితేనే పనుల్లో ముందడుగు వేస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ, బ్యారేజీ కూలిపోయినప్పుడు నిర్వహణ ఇంకా మిగిలి ఉంది మరియు M&T ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారికంగా నిర్మాణ సంస్థ మొత్తం పునరుద్ధరణ ఖర్చును భరిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్ చీఫ్, కింది స్థాయి ఇంజనీర్లకు లేఖ పంపారు
* జగ్గా రెడ్డి సంచలన లేఖ
సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనంతరం జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సోనియా, రాహుల్, ప్రియాంలకు లేఖ రాశారు. తన కార్యచరణను లేఖలో పేర్కొన్నారు.‘ఒక బలవంతడు భూమి మీద ఎప్పటికి బలవంతుడిలాగే ఉండడు.. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. ఎదో ఒక్కరోజు బలహీనుడు కాకతప్పదు. ఇది ఏ వ్యవస్థలోనైనా వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతే. అలాగే బలహీనుడు ఎప్పటికి బలహీనుడు గానే ఉండడు. ఆ బలవంతుడి యొక్క సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనము బలహీనుడి యొక్క బలహీనత కాదు.బలహీనుడు కాలం యొక్క సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాలము చేసే నిర్ణయం లో బలహీనుడు ఒక్కరోజు బలవంతుడు అవుతాడు. ఎలాగైతే మనిషి జీవితం యవ్వన్నం నుండి ముసలితనం వరకు ఎలా ఉంటుందో. అలాగే ఈ బలవంతుడు -బలహీనుడి కథ కూడా అంతే.. ఒక నాయకుడి యొక్క గెలుపు ప్రజలను పరిపాలించే సమయము. ఒక నాయకుడి యొక్క ఓటమి గతంలో పరిపాలించిన పరిపాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి మళ్ళీ సవరించుకొని ప్రయాణం చేసి ముందడుగు వేసే సమయం. జగ్గారెడ్డిగా నేను 5 సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసిన 3 సార్లు సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచిగా పరిపాలించా.మొదటి సారి 2014 లో ఓడిపోయినా.. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పింది. ఇప్పుడు 2023లో రెండోసారి ఓడిపోయినా. ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చేసుకున్నా. ఐతే ఈ సారి మా సంగారెడ్డి ప్రజలకు నాకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారు. అందుకే ఈ సమయాన్ని నేను పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలనీ ఆలోచన చేసుకున్నా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ గారు అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 6 పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు నేను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా ఆ 6 పథకాలు అందుతాయి.ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారానికి సంబదించిన ఆర్గనైజేషన్ పనిని ఒక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పూర్తి టైమ్ కేటాయించుకుని తీరగాలని ఆలోచన చేసుకుంటున్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని నా యొక్క ఆలోచనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకత్వానికి, నాయకులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు,రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాను.’ అంటూ ముగించారు.
* రేవంత్ తీసుకునే నిర్ణయం శుభపరిణామం!
పీవీ నర్సింహా రావు కాంగ్రెస్ వాదీ.. నిన్న హరీష్ రావు ప్రేమ వలకపోస్తే ఆశ్చర్యంగా వుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం గా, పీఎం గా పనిచేశారు పీవీ అన్నారు. ఏ పదవీ చేపట్టిన ఆ పదవీకి వన్నెతెచ్చారనిత తెలిపారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని కుటుంబ సభ్యులే కోరారని అన్నారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనలతో చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరం అన్నారు. నిన్న సభలో చర్చలు చూస్తుంటే.. ఉద్యమ పార్టీ అనిచెప్పుకునే బిఆర్ఎస్ నేతలు.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న మౌనంగా వున్నారని తెలిపారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని మండిపడ్డారు.స్వార్ధ పూరిత రాజకీయాలకోసమే.. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్ పొందే హక్కు వుందన్నారు. కానీ 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాను అన్నారు. ఐటీఐఆర్ తేవడంలో ఫెయిల్యూర్ అంటూ మండిపడ్డారు. విభజన చట్టం హక్కులను సాధించడంలో విఫలమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విమర్శలు చేయడం బంద్ చేయండని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా చేసిందే బీఆర్ఎస్ అంటూ కవితకు సెటైర్ వేశారు. కాళేశ్వరం అవినీతి బయటపెడతామని తెలిపారు. శాసన సభ సభ్యులను తీసుకెళ్లింది మీరు.. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం శుభపరిణామం అని అన్నారు.
* మంత్రిపై నాగబాబు ఆగ్రహం
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్(Kakani Govardhan) గ్రానైట్ అక్రమ తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Konidela Nagababu) విమర్శించారు. ఇవాళ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు.తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు తెలంగాణ(Telangana)లో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. మంగళగిరిలో ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కురాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు.రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ – జనసేన పొత్తు రానున్న ఎన్నికల్లో తమను అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.”నాకు పదవులపై ఇంట్రెస్ట్ లేదు. ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే. కాకాణి అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన సోమిరెడ్డి దీక్షకు సమయాభావం వల్ల వెళ్లలేకపోయాను. జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు. వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. నెల్లూరులో జనసేన నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారు. వైనాట్ 175 అని వైసీపీ వాళ్లు అంటున్నారు.. వై నాట్ వైసీపీ జీరో అని మేం అంటున్నాం. నియంతృత్వ పోకడలతో వెళ్తున్న సీఎం జగన్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. నిజమైన నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన చేయడం మంచిదికాదు. త్వరలో జరిగే ఎన్నికల్లో మేం గెలవబోతున్నాం. వైసీపీ 20 – 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –