DailyDose

తెలిస్తే సమాచారం ఇవ్వండి!

తెలిస్తే సమాచారం ఇవ్వండి!

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్టులో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ ఉన్నారు. వీరి ఫొటోలతో కూడిన వివరాలను ‘ఎన్ఐఏ ఇండియా’ ట్విటర్ ఖాతాలో అధికారులు పోస్టు చేశారు. దీనికితోడు వారికోసం గాలిస్తున్నారు.

ఈ కేసులో దేవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు కేరళ 11 మంది, కర్నాటక ఐదుగురు, తమిళనాడు చెందిన ఐదు మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్ గా ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు. వీరి సమాచారం తెలిస్తే 9497715294 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతో పాటు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.

పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో నిషేధం విధించింది. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వందకుపైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, అదిలాబాద్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా పీఎఫ్ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితో పాటు మిగిలిన వారిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z