* తగ్గిన బంగారం ధర
ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ధరలు తగ్గినా, పెరిగినా కానీ బంగారం కొనడానికి మహిళలు చాలా ఆసక్తిని చూపిస్తారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. నేడు ప్రధాన నగరాలైన బంగారం ధరలు తగ్గాయి.హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర-రూ.57, 300,24 క్యారెట్ల బంగారం ధర-రూ. 62, 510.విజయవాడలో నేటి బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర-రూ.57, 300,24 క్యారెట్ల బంగారం ధర-రూ. 62, 510.
* గూగుల్ సీఈఓ పశ్చాత్తాపం
గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ 2023 ఆరంభంలో ఏకంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనలను, అలజడులను రేకెత్తించింది. దీనిపై తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాము అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. నాడు తాము తీసుకున్న నిర్ణయం తప్పేనని అంగీకరించారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ పనిచేయక తప్పలేదని, అయితే మరోలా వ్యవహరిస్తే బాగుండేదని అన్నారు.బిజినెస్ ఇన్‌సైడర్ ప్రచురించిన కథనం ప్రకారం.. సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భారీగా ఎత్తున ఉద్యోగులను తొలగించడం ద్వారా మీరు ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. అందుకు పిచాయ్ సమాధానం ఇస్తూ.. అది తప్పేనని అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని చెప్పారు. గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ అంత క్లిష్టమైన క్షణాలను ఎదుర్కోలేదని తెలిపారు.అప్పుడు తాము ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అది మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదని పిచాయ్ చెప్పారు. అయితే నాటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే బాగుండేదంటూ పశ్చాతాపం వ్యక్తంచేశారు. నాటి తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, ‘గూగుల్‌జీస్ట్’ లాంటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఛానెల్‌లలో అది స్పష్టంగా కనిపించిందని అన్నారు.
* ఏడాది గరిష్ట స్థాయికి పీఎన్బీ షేర్లు
గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన ర్యాలీ కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ర్యాలీలో అనేక కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత వారాల ర్యాలీలో చాలా స్టాక్‌లు కొత్త శిఖరాలను నమోదు చేశాయి. దీని వల్ల ప్రభుత్వ బ్యాంకు PNB షేర్లు కూడా చాలా లాభపడగా, ఈ ప్రభుత్వ బ్యాంకు కూడా స్టాక్ మార్కెట్ లో తన పేరు మీద రికార్డు సృష్టించింది. గత వారం చివరి రోజైన డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం పిఎన్‌బి షేర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఈ షేరు 1.33 శాతం లాభంతో రూ.91.10 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో PNB షేర్లు ఒక దశలో 2 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ.92కి చేరాయి. ఇది దాని కొత్త 52 వారాల గరిష్టం.దీంతో పీఎన్ బీ మార్కెట్ క్యాప్ పెరిగి రూ.లక్ష కోట్లు దాటింది. PNB మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు దాటిన మూడవ ప్రభుత్వ బ్యాంకుగా అవతరించింది. ఇంతకు ముందు రెండు ప్రభుత్వ బ్యాంకులు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే ఈ ఘనత సాధించాయి. 5.79 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో SBI అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు రెండవ అతిపెద్ద భారతీయ బ్యాంకు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.1.16 లక్షల కోట్లు. గత కొన్ని నెలల్లో PNB షేర్లలో విపరీతమైన పెరుగుదల ఉంది. దీని కారణంగా ఇది మల్టీబ్యాగర్‌గా మారడానికి దగ్గరగా ఉంది. గత వారం PNB షేర్లు నాలుగున్నర శాతం బలపడగా, గత నెలలో సుమారు 17 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో PNB ధర 75 శాతానికి పైగా బలపడింది. ఇచ్చిన వ్యవధిలో స్టాక్ కనీసం రెండింతలు అంటే 100 శాతం పెరిగితే, దానిని మల్టీబ్యాగర్ అంటారు.సెప్టెంబర్ త్రైమాసికంలో PNB ఆర్థిక ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 327 శాతం పెరిగి రూ.1,756 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అంటే జూలై-సెప్టెంబర్ 2022లో PNB నికర లాభం రూ. 411.27 కోట్లు. బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి ఏడాది క్రితం 10.48 శాతం నుంచి 6.96 శాతానికి తగ్గింది.
* అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం(ఏప్రిల్-డిసెంబర్) వరకు ముందస్తు పన్ను వసూళ్లు 19.8 శాతం పెరిగాయి. రెండంకెల వృద్ధితో సమీక్షించిన కాలానికి మొత్తం రూ. 6.24 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లు జరిగాయి. ఇది ఆర్థికవ్యవస్థ బలమైన వృద్ధిని సూచిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఇవి మూడవ త్రైమాసికానికి ముందస్తు పన్ను చెల్లించడానికి డిసెంబర్ 15 వరకు ఉన్న గడువు నాటికి జరిగిన చెల్లింపులని, బ్యాంకుల నుంచి మరింత డేటా రావాల్సి ఉంది, సోమవారానికి వసూళ్లు పెరిగవచ్చని అధికారి పేర్కొన్నారు. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ. 4.81 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ. 1.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ముందస్తు పన్ను వసూళ్లలో ఈ స్థాయి వృద్ధి చివరి త్రైమాసికంలోనూ కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు. 2023-24లో బడ్జెట్ అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఉంటాయని ఆశిస్తున్నట్టు అదితి నాయర్ వెల్లడించారు.
* రెనాల్ట్ నుంచి తొలి ఎలక్ట్రిక్ వాహనం త్వరలో లాంచ్
గ్లోబల్ వైడ్ మంచి మార్కెట్ ఉన్న రెనాల్ట్ నుంచి తొలి ఎలక్ట్రిక్ వాహనం త్వరలో లాంచ్ కానుంది. ఇటీవలే రెనాల్ట్ డస్టర్ కారును గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లో కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2024 తొలి నాళ్లలోనే దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది. దీని పేరు థర్డ్ జెన్ రెనాల్ట్ 5. అయితే అధికారిక లాంచ్ కు ముందే ఈ కారు డిజైన్ చిత్రాలను లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. దీని లుక్ ప్రకారం చూస్తే ఈ కారు టాటా టైగోర్, ఎంపీ కామెట్ కార్లకు పోటీగా దీనిని తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రెనాల్ట్ కూడా యూరోపియన్ మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థర్డ్ జెన్ రెనాల్ట్ 5 పేరుతో దీనిని తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విడుదల చేసింది. కాగా 2024, ఫిబ్రవరీ 26వ తేదీన గ్లోబల్ వైడ్ గా దీనిని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్ల చేసుకుందా. అయితే ఈ కారు ఎక్స్ టీరియర్ డిజైన్ కు సంబంధించిన పేటెంట్ చిత్రాలు లీక్ అయ్యాయి.ఇటీవల విడుదలైన చిత్రాల ప్రకారం ఇది 2021 కాన్సెప్ట్ కు దగ్గరగా ఉంది. హెడ్ లైట్లు గుడ్రంగా ఎల్ఈడీ ప్రొజెక్టర్లతో ఉంది. బానెట్ పై వైవిధ్యమైన చార్జ్ ఇండికేటర్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ చార్జ్ స్థాయిలు కనిపిస్తాయి. వెనుకవైపు బ్రేక్ లైట్లు కూడా కొన్ని అడ్జస్ట్ మెంట్లు చేశారు. వెనకాల బ్లాక్ రిమ్ ఎక్కువ వెడల్పు ఉన్న లైట్ బార్ ను ఏర్పాటు చేశారు. ఇది ఏఎంపీఆర్ స్మార్ట్ ప్లాట్ ఫారం ఆధారంగా తయారు చేశారు.ఈ కారుకు సంబంధించిన టీజర్ కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. దీనిలో 52కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 400కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఏఎంపీఆర్ స్మాల్ ప్లాట్ ఫారం సాయంతో హ్యాండ్లింగ్, మల్టీ లింక్ యాగ్జిల్ ఉంటాయి. మంచిసస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. 135హెచ్పీ మోటార్ ఉంటుంది. ఇది రెనాల్ట్ క్లియోన్ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు.ఈ రెనాల్ట్ 5 ఎలక్ట్రిక్ కారు యూరోపియన్ దేశాలతో పాటు గ్లోబల్ వైడ్ గా 2024, ఫిబ్రవరీలో లాంచ్ అవుతోంది. కాగా మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతోందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే రెనాల్ట్ న్యూ డస్టర్ ఎస్యూవీ కారు మన దేశీయ మార్కెట్లో 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –