Movies

ఈ మూడు వర్గాలకు చెందిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎప్పుడూ కనిపిస్తుంటారు!

ఈ మూడు వర్గాలకు చెందిన హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎప్పుడూ కనిపిస్తుంటారు!

ఏడాదికో సినిమా చేయడం కథానాయకులకి కష్టమేమో కానీ… కథానాయికలు నాలుగైదు సినిమాలైనా సులభంగా చేసేస్తారు. ఎక్కువ సినిమాల్లో నాయికల పాత్రల పరిధి పరిమితం కావడం… తక్కువ కాల్షీట్లతోనే పని పూర్తి చేసుకొని బయటికొచ్చే వెసులుబాటు ఉండటం వీళ్లకి కలిసొచ్చే విషయం. అందుకే వీలైనన్ని భాషల్లో… వీలైనన్ని సినిమాలు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంటారు. ఇంకా కాల్షీట్లు ఖాళీగా ఉన్నాయనిపిస్తే… వెబ్‌ సిరీస్‌లపైనా ఓ కన్నేస్తుంటారు. తెలుగులో ఈ ఏడాది అరడజను మందికిపైగా స్టార్‌ కథానాయకులు తెరపై కనిపించలేదు. కథానాయికలు మాత్రం అవకాశాల విషయంలో ఎప్పట్లాగే పట్టు ప్రదర్శిస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. పూజాహెగ్డే మినహా స్టార్‌ భామల్లో ఈ ఏడాది చాలా మందికి మంచి విజయాలు దక్కాయి.

స్టార్లుగా చలామణీ అవుతున్న భామలు కొద్దిమందైతే… స్టార్‌ స్థానం కోసం రేసులో ఉన్నవాళ్లు మరికొద్దిమంది… వీళ్లతోపాటు తొలి పరిచయాల మెరుపులు ఇంకొంతమందివి… ఈ మూడు శ్రేణులకి చెందిన కథానాయికలు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ కనిపిస్తుంటారు. ఏ అవకాశం ఎవరిని వరిస్తుందో ఊహించలేం. స్టార్‌ భామలు తమ స్థానాన్ని నిలబెట్టుకునేలా తగిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తుంటారు. జోరుమీదున్న నవతరం భామలేమో స్టార్‌ హీరోల చిత్రాలపై దృష్టి పెడుతూ… స్టార్‌ కథానాయిక అనిపించుకోవాలనే లక్ష్యంతో ప్రయాణం చేస్తుంటారు. ఇక కొత్త మెరుపులు ఉండనే ఉంటాయి. ఒక్క సినిమాతోనే అనూహ్యంగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించే కొత్త భామలూ అప్పుడప్పుడూ వస్తుంటారు. 2023లో ఈ మూడు రకాల భామలు సత్తాని చాటారు. గత మూడు నాలుగేళ్లుగా తెలుగు చిత్రసీమపై తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన పూజాహెగ్డే మినహా అగ్ర కథానాయికలు చాలామంది అవకాశాలు, విజయాల పరంపరని కొనసాగించారు.

అనుభవాన్ని రంగరించి…
తెలుగు చిత్రసీమలో అనుభవం పండిన కథానాయికలు చాలామందే కనిపిస్తున్నారు. ఒకప్పుడు బలమైన పాత్రలు రాయాలన్నా ‘వీటిని చేసేవాళ్లు ఎవరున్నారు?’ అనే ప్రశ్న వేసుకుని ఆగిపోయేవాళ్లు దర్శకులు. ఇప్పుడు ఆ సందేహమే అవసరం లేదన్నట్టుగా నటనతో సత్తా చాటుతున్నారు కథానాయికలు. అనుష్క, కాజల్‌, తమన్నా, శ్రుతిహాసన్‌ మొదలుకొని జోరుమీదున్న సమంత, రష్మిక, కీర్తిసురేశ్‌ తదితర కథానాయికలు బలమైన పాత్రలకి, నటనకి కేరాఫ్‌గా కనిపిస్తున్నారు. అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో మరోసారి మ్యాజిక్‌ చేసింది.. సమంత ఈ ఏడాది రెండు చిత్రాల్లో సందడి చేసింది. నాయికా ప్రధానమైన ‘శాకుంతలం’ విజయాన్ని ఇవ్వలేదు కానీ, ‘ఖుషి’తో ఆమె చేసిన సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శ్రుతిహాసన్‌ ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ సరసన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకుంది. ‘హాయ్‌ నాన్న’లో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది. త్వరలోనే విడుదల కానున్న ‘సలార్‌’లోనూ ఆమే కథానాయిక. కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె జోరు కొనసాగుతోంది. అడివి శేష్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. తమన్నా ‘భోళాశంకర్‌’లో చిరంజీవి సరసన నటించింది. ‘జైలర్‌’తో కావాలయ్యా… అంటూ తెలుగు ప్రేక్షకుల్నీ మురిపించింది. కాజల్‌ ‘భగవంత్‌ కేసరి’తో పునరాగమనం చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘సత్యభామ’ అనే నాయిక ప్రధానమైన సినిమా చేస్తుంది.

సత్తా చాటారు…రష్మిక నేరుగా తెలుగు సినిమా చేయలేకపోవచ్చు కానీ… అనువాదాలుగా వచ్చిన ‘వారసుడు’, ‘యానిమల్‌’ చిత్రాలతో బలమైన ప్రభావమే చూపించింది. తెలుగు సినిమా చేయలేదన్న లోటుని ఆమె ఈ సినిమాలతోనే తీర్చేశారు. ఇప్పుడు మాత్రం తెలుగులో ‘పుష్ప2’, ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాల్ని చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నటనా ప్రధానమైన పాత్రలనగానే గుర్తొచ్చే కీర్తిసురేశ్‌ ఈ ఏడాదీ తన శైలిలో పాత్రల్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని మురిపించారు. నానితో కలిసి చేసిన ‘దసరా’ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. తమిళంలో చేసిన ‘మామన్నన్‌’ తెలుగులో ‘నాయకుడు’గా అనువాదమైంది. అందులోనూ కీర్తి నటన ప్రేక్షకుల్ని మెప్పించింది.

కొత్త మెరుపులు…ఈ ఏడాది తెలుగులో మార్మోగిన కథానాయిక పేరు… శ్రీలీల. ఈ ఏడాది ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకున్నదీ, ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆమే. గతేడాది ‘ధమాకా’తో విజయాన్ని సొంతం చేసుకుని, తనలోని ప్రతిభనంతా ఆవిష్కరించిన శ్రీలీల ఈ సంవత్సరం ‘భగవంత్‌ కేసరి’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’, ‘ఆదికేశవ’, ‘స్కంద’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘భగవంత్‌ కేసరి’లో శ్రీలీల నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘గుంటూరు కారం’, ‘అనగనగా ఒక రాజు’తోపాటు, విజయ్‌ దేవరకొండ, నితిన్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ నెలలోనే విడుదలయ్యే ‘డెవిల్‌’తో సంయుక్త మేనన్‌ విడుదలల సంఖ్య మూడుకి చేరుతుంది. ‘సార్‌’, ‘విరూపాక్ష’ సినిమాలతో ఆమె ఇప్పటికే విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z