Politics

సూర‌త్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన మోదీ

సూర‌త్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన మోదీ

సూరత్‌ డైమండ్‌ బోర్స్‌ (Surat Diamond Bourse – SDB) భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించారు. 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా చెబుతున్నారు.

వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి ఎస్‌డీబీ కేంద్రంగా నిలవనుంది. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ భవనాలను గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి సమీపంలోని ఖాజోడ్‌ గ్రామంలో నిర్మించారు. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఇది అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ క్లియరెన్స్‌ హౌస్‌ కూడా ఇందులోనే ఉంటుంది. ఆభరణాల రిటైల్‌ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్‌, సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది.

ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న అనేక మంది వజ్రాల వ్యాపారులు ఇప్పటికే ఎస్‌డీబీలో కార్యాలయాలను దక్కించుకొన్నారు. వేలం పద్ధతిలో వీటిని ఎస్‌డీబీ మేనేజ్‌మెంట్‌ వారికి కేటాయించింది. దీంట్లో దాదాపు 4,500 కార్యాలయాలు ఉన్నాయి. ‘డైమండ్‌ రీసెర్చ్‌ అండ్‌ మర్కంటైల్‌ సిటీ’లో (DREAM City) భాగంగానే ఎస్‌డీబీని నిర్మించారు. 2015 ఫిబ్రవరిలో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ దీనికి భూమిపూజ చేశారు.

డ్రీమ్‌ సిటీలో మొత్తం 35.54 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్‌డీబీలో మొత్తం తొమ్మిది భవనాలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 15 అంతస్తులు నిర్మించారు. ఈ సముదాయాల్లో 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు రూ.3,200 కోట్లతో దీన్ని నిర్మించారు. పూర్తి హరిత భవనంగా తీర్చిదిద్దారు. నాలుగు వేల సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్‌ గేట్లతో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

సూరత్‌ వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు సానబెట్టడం, పాలిష్‌ చేయడం వంటి 90 శాతం కార్యకలాపాలు ఇక్కడే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎస్‌డీబీతో వజ్రాల వ్యాపారం మరింత విస్తరించనుంది. ఈ బృహత్‌ కట్టడం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఎస్‌డీబీ అందుబాటులోకి రావటంతో డైమండ్‌ కటింగ్‌ క్యాపిటల్‌గా సూరత్‌ పేరు సుస్థిరం కానుంది.

ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద కార్యాలయ సముదాయంగా అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ఉండేది. ఇది దాదాపు 66,73,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z