Business

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనత

అయిదేళ్ల వ్యవధి(2018-23)లో భారీ స్థాయిలో సంపదను సృష్టించిన కంపెనీల్లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా అయిదోసారీ అగ్రస్థానంలో నిలిచింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత 17 సార్లు నిర్వహించిన అయిదేళ్ల నివేదికలో 10 సార్లు రిలయన్స్‌ నంబర్‌ 1 స్థానంలో నిలవడం మరో విశేషం. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..

రూ.9.6 లక్షల కోట్లు..: 2018 నుంచి 2023లో ఇప్పటిదాకా ఈ దిగ్గజం రూ.9,63,800 కోట్లను సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో టీసీఎస్‌(రూ.6.77 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌(రూ.4.15 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్‌(రూ.3.61 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌(రూ.2.8 లక్షల కోట్లు) తదితరాలున్నాయి.

రూ.10 లక్షలు.. అయిదేళ్లలో రూ.కోటికి: ఇక అత్యంత వేగంగా గత అయిదేళ్లలో షేరు ధరను పెంచుకున్న కంపెనీల్లో లాయిడ్స్‌ మెటల్‌ నిలిచింది. ఈ సంస్థ షేరు 79 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌)ను నమోదు చేసింది. దీని తర్వాతి స్థానాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(78%), ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌(63%), లిండే ఇండియా(56%), అదానీ పవర్‌(53%) ఉన్నాయి.
నీ టాప్‌-10 అత్యంత వేగవంత సంపద సృష్టి కంపెనీల్లో 2018లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే 59 శాతం సీఏజీఆర్‌తో 2023 కల్లా రూ.కోటికి చేరేది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 12 శాతం సీఏజీఆర్‌తో లాభాలందించడం గమనార్హం.

ఇక స్థిరంగా సంపదను సృష్టించిన కంపెనీల్లో అంటే గత అయిదేళ్లలో ప్రతీ సంవత్సరం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కంటే అధిక ప్రతిఫలాలనిచ్చిన వాటిలో కాప్రి గ్లోబల్‌(50 శాతం సీఏజీఆర్‌) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుణ్‌ బేవరేజెస్‌, గ్రైండ్‌వెల్‌ నార్టన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లు నిలిచాయి.
ఇక ఆల్‌ రౌండ్‌ పనితీరును ప్రదర్శించిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 78 శాతం సీఏజీఆర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వరుణ్‌ బేవరేజెస్‌(50%), అదానీ పవర్‌(52%), ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌(63%), ఐసీఐసీఐ బ్యాంక్‌ (26%) ఉన్నాయి. వీటి తర్వాత ఎస్‌ఆర్‌ఎఫ్‌, లిండే ఇండియా, అదానీ ఎనర్జీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు నిలిచాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z