Business

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. వరంగల్ ఆర్టీసీ ఆర్.ఎం. శ్రీలత మాట్లాడుతూ ఇవాల్టి నుంచి (డిసెంబర్ 17) మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించనున్నామని.. ప్రతి బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో ప్రతి 45 నిమిషాలకు ఒక ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుందని వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని శ్రీలత సూచించారు.

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుండగా.. జాతరకు ముందే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. మరోవైపు ములుగు జిల్లాలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి 14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగానికి 8.28 కోట్లు, పోలీస్ శాఖకు 10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2.80 కోట్లు, రెవెన్యూ శాఖకు 5.25 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 4.35 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో త్వరలో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలవనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z