దొంగతనాలు, దోపిడీల్లో ఆరితేరిన ఘనులు.. ఒకసారి చోరీ చేసిన ప్రాంతంలో మరోసారి అడుగుపెట్టని నేరగాళ్లు.. అనుమానం వస్తే సరిహద్దులు దాటేందుకైనా.. మట్టు బెట్టేందుకైనా వెనుకాడని కిరాతకులు.. దేశవ్యాప్తంగా దోపిడీలు.. దొంగతనాలు చేస్తూ తేలిగ్గా తప్పించుకునే ఈ ముఠాల గుట్టును సైబరాబాద్, రాచకొండ పోలీసులు చాకచక్యంగా కనిపెట్టారు. సీసీ కెమెరాల్లో నిందితుల చిత్రాలు నమోదవ్వకున్నా.. వారి ఆనవాళ్లను గుర్తించే అవకాశమే లేకున్నా.. కేవలం ఒక్క వేలిముద్ర ఆధారంగా కీలకమైన కేసుల్ని చేధించారు. రాష్ట్రాలు దాటి నక్కిన నేరగాళ్లను కటకటాలు లెక్కపెట్టించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ, మేడిపల్లి పోలీసులు, సైబరాబాద్ పరిధిలో రాజేంద్రనగర్ పోలీసులు మూడు దోపిడీ కేసుల్ని చేధించిన తీరును జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ), కేంద్ర వేలిముద్రల విభాగం-2022లో నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించాయి. దేశవ్యాప్తంగా వేలిముద్రల ఆధారంగా చేధించిన అత్యుత్తమ కేసులుగా పేర్కొంది. తెలంగాణ నుంచి మొత్తం ఆరు కేసులు ప్రస్తావించగా అందులో మూడు ఈ రెండు కమిషనరేట్లవే కావడం గమనార్హం.
బంగ్లాదేశ్ సరిహద్దులో వేట..!
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు పక్కనే ఉండే ఒక ఎలక్ట్రానిక్స్ షోరూములో రూ.70 లక్షల విలువైన 432 స్మార్టు ఫోన్లు చోరీ అయ్యాయి. నిందితులు మాస్కులు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారింది. మల్కాజిగిరి ఫింగర్ ప్రింట్ విభాగం రంగంలోకి దిగి మొబైల్ డబ్బాలు, కవర్లు, నగదు కౌంటర్ దగ్గర 25 వేలిముద్రలు గుర్తించారు. వాటిని పాత నేరస్థుల డేటాతో పోల్చినా తేలలేదు. దాదాపు 10 రోజులు ఎలాంటి ఆధారాలు లభ్యమవలేదు. ఈలోపు వీటిని నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పోల్చగా ఒక నేరగాడితో సరిపోలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌లో బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడని గుర్తించారు. రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో వేర్వేరు రాష్ట్రాల్లో గాలించి.. 14 రోజుల తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న షేక్‌సత్తార్, అసీదుల్ షేక్‌ను అరెస్టు చేశారు. నిందితులు అప్పటికే సెల్‌ఫోన్లను బంగ్లాదేశ్‌కు తరలించారు.
గతేడాది జులై 27న మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు, నగదు కలిపి రూ.10.9 లక్షలు చోరీ అయ్యాయి. ఘటనాస్థలిలో సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలు లభ్యమవలేదు. చివరకు వేలిముద్రల విభాగం అధికారులకు వంటగది తలుపుపై ఒక వేలిముద్ర లభ్యమైంది. దీన్ని రాష్ట్రస్థాయి డేటాతో పోల్చగా పాత నేరస్థుడని తేలింది. కూపిన లాగిన పోలీసులు అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
స్థానిక నేరస్థుడి పనే!
గతేడాది డిసెంబరు 27న రాజేంద్రనగర్‌లోని ఫ్రెండ్స్‌కాలనీలోని ఒక ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు కలిపి రూ.1.25 లక్షలు చోరీ అయ్యాయి. యజమాని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. శంషాబాద్‌లోని వేలిముద్రల విభాగానికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా గమనించిన సిబ్బంది.. చిందరవందరగా పడేసిన ఒక ప్లాస్టిక్ డబ్బా, ట్యాబ్, బీరువాపై ఆరు వేలిముద్రల్ని గుర్తించారు. ఇందులో రెండు ఇంట్లోవారివని తేలింది. మరో రెండు వేటితోనూ సరిపోలలేదు. ట్యాబ్, బీరువాపై గుర్తించిన వేలిముద్రల్ని పాత నేరగాళ్ల వేలిముద్రల డేటాతో సరిపోల్చగా పాత నేరస్థుడిదని తేలింది. ఫొటో, ఇతర వివరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –