Agriculture

ధరలు పెరగడానికి కారణాలేంటి?

ధరలు పెరగడానికి కారణాలేంటి?

నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పప్పులు, బియ్యం, ఉల్లిగడ్డలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే వీటి ధరలు గణనీయంగా పెరగడంతో ఇంటి ఖర్చులపై ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఏడాది వ్యవధిలో కందిపప్పు ధర దాదాపు 50 శాతం పెరిగితే… బియ్యం 13-25 శాతం వరకు పెరిగింది. ముఖ్యంగా సన్న బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖపై ఇటీవల జరిపిన సమీక్షలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశం వెల్లడైంది. వీటిలో ముఖ్యంగా బియ్యం, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉల్లిగడ్డలు ధరల పెరుగుదల ప్రభావం ఉంది.

నిత్యావసరాల్లో 16 రకాల వస్తువుల ధరలను పౌరసరఫరాలశాఖ రోజువారీగా సేకరిస్తుంది. వీటి ధరలను విశ్లేషించగా..మొత్తం 12 రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. నాలుగింటి ధరలు తగ్గాయి. మిర్చి, పల్లి నూనె స్వల్పంగా తగ్గగా… పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు 15.72, 30.32 శాతం చొప్పున తగ్గాయి.

వీటితో పాటు చక్కెర ధర కిలో 7 శాతం (రూ.39.09 నుంచి రూ.41.95కి), చింత పండు గ్రేడ్‌-1 రకం కిలోకి రూ.15.08 శాతం (రూ.118.50 నుంచి రూ.136.37), చింతపండు గ్రేడ్‌-2 రకం ధరలు 17.31 శాతం (రూ.100.69 నుంచి రూ.118.11కి) పెరిగాయి.

బియ్యం సూపర్‌ఫైన్‌ కిలో రూ.49.72 నుంచి రూ.55.74కి పెరిగింది. క్షేత్రస్థాయిలో బియ్యం దుకాణాల్లో ఆ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. సూపర్‌ఫైన్‌ రకం బియ్యం ధర కిలో రూ.62, రూ.70గా ఉంది.
ఉల్లిగడ్డలు కిలో- గతేడాది డిసెంబరులో రూ.27.19 ఉండగా, ఈ ఏడాది నవంబరులో రూ.46.97కి, డిసెంబరు 11 నాటికి రూ.57.44కి పెరిగింది.

ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?
ఆహార పంటల సాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణాలు. రైస్‌మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాల్ని అక్రమంగా నిల్వ చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణాలు అవుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z