కమలం పార్టీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. సహజంగా ఓడిపోతే బాధపడతారు. కాని బండి సంజయ్ ఓడినందుకు ఏమాత్రం బాధపడటంలేదన్నది పార్టీలో టాక్. మళ్ళీ ఎంపీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు బండి. తెలంగాణ బీజేపీలో స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన బండి సంజయ్‌కు ఎంపీగా ఉండటమే ఇష్టమంటున్నారు. పార్టీ హైకమాండ్ బలవంతం మీదే ఎమ్మెల్యేగా పోటీ చేశారట. అసలు బండికి ఎంపీ పదవంటే అంత మోజు ఎందుకు?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ఆ పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్ రాజకీయ జీవితంలో కొన్ని మెరుపులు.. మరికొన్ని మరకలు అలా ఒకదాని వెంట మరొకటి అలా కనిపిస్తూనే ఉంటాయన్నది టాక్. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటల రాజేందర్ వంటివారితో పొసగకపోవడం.. బయట వినిపించిన కొన్ని ప్రచారాలతో మొత్తానికి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయారు.
పార్టీ పదవి నుంచి తప్పించిన బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుండవచ్చని అంతా ఊహించారు. బండిలో కూడా ఏదో ఓ మూల ఆ ఆశ ఉండేది. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం ఆయన్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టినా.. చాలాకాలం బండి సంజయ్ ఫీవర్ మాత్రం బీజేపీ క్యాడర్ ను వెంటాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ కు హెలిక్యాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ ప్రచారం చేయించిందంటేనే.. మాస్ లీడర్‌గా బండి అవసరం ఎంతుందో పార్టీ గమనించిందనే అనుకోవాలి.
అయితే అసెంబ్లీ బరిలో నిలబడటానికి ససేమిరా అన్న బండిని.. రెండుసార్లు ఓడిన కరీంనగర్ సీటులోనే మూడోసారి బరిలోకి దింపింది. దీంతో మొదట నారాజ్ గానే ఉన్న బండి సంజయ్ ప్రచారంలో మెరుపులు మెరిపించారు. ఒక దశలో అన్ని సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బండిదే విజయమని తేల్చాయి. కానీ, ఎప్పుడూ కరీంనగర్ అసెంబ్లీ ఫలితాల్ని ప్రభావితం చేసే ముస్లిం మైనార్టీ ఓట్లే ఈసారి కూడా బీఆర్ఎస్ కే ఎక్కువగా పోలవ్వడంతో పాటుగా..హిందూ ఓట్ పోలరైజేషన్ బండిని గెలిపించే స్థాయిలో టర్న్ కాలేదు. దీంతో బండి సంజయ్ కరీంగనర్ అసెంబ్లీ బరిలో మళ్ళీ దెబ్బతిన్నారు. అయితే బండిపై గెలిచిన గంగుల కమలాకర్‌కు వచ్చిన మెజారిటీ 3 వేల ఓట్ల పైచిలుకే కావడంతో..ఆయనకు చాలా ఊరట కలిగించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరిదాకా వచ్చి ఓడిపోయానన్న బాధ కొద్ది రోజులు కనిపించినా.. ఈసారి పోలైన ఓట్ల సంఖ్య బాగా పెరగడంతో మరోవైపు ఆనందం కనిపించింది. అదే సమయంలో తాననుకున‍్నట్లే మళ్లీ ఎంపీ బరిలో నిలిచేందుకు రూట్ క్లియర్ అయిందన్న భావన కనిపిస్తోంది. సాధారణంగా గెలిచిన వారు పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బండి సంజయ్ తాను ఓటమి పాలైనా.. తన కొరకు కష్టించిన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, బంధు మిత్రులందిరినీ పిలిచి ఓ పెద్ద విందే ఏర్పాటు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలే తన టార్గెట్ గా బండి ప్రయత్నాలు మొదలెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు.
ఓవైపు పార్టీలోనే తన అంతర్గత శత్రువుల్లా తయారైన ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ వంటివారికి తన సోషల్ మీడియా టీమ్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బయటి ప్రత్యర్థులతో పోటీకి సిద్ధమయ్యేందుకు బండి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తంగా కార్పోరేటర్ స్థాయి నుంచి ఎదిగిన బండి రాజకీయ జీవితంలో కొన్ని ఓటములు, మరికొన్ని విజయాలు కలిసి.. బాగా రాటుదేల్చాయనే కామెంట్స్ పొల్టికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –