Business

లోక్‌సభలో టెలికాం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

లోక్‌సభలో టెలికాం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

టెలికాం (Telecom) రంగంలో నియమ, నిబంధనల కోసం 138 ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు-2023 (Telecommunications Bill 2023)ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సోమవారం లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆగస్టులోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ కొత్త టెలికాం బిల్లులో కమ్యూనికేషన్స్‌కు సంబంధించి అనేక నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్లో కీలక మార్పులు చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక ట్రాయ్‌ అధికారాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్‌ కాలింగ్, మెసేజింగ్‌ యాప్‌లను టెలికాం లైసెన్సు పరిధిలోకి తీసుకురావాలని తొలుత ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత ఈ అంశాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. వీటిని టెలికమ్యూనికేషన్స్‌ పరిధిలోకి తీసుకురావాలని గతంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే, వాటిని తాజా బిల్లులో చేర్చకపోవడంతో వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఊరట కల్పించినట్లయింది.

మరోవైపు, టెలికాం సేవల కోసం తప్పుడు వివరాలను సమర్పిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. టెలికాం సంస్థలకు ఒక్కో సర్కిల్‌పై గరిష్ఠ జరిమానా విధింపు పరిమితిని రూ.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు కుదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z