తెలంగాణలో నూతన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్డుకు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలన్నారు. అవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కి.మీ. దూరంలోపే ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయంలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆ భూముల వివరాలు ఇవ్వండి..
పరిశ్రమల కోసం సేకరించే భూములు, బంజరు భూములై ఉండడంతోపాటు సాగుకు యోగ్యంకాని విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందువల్ల రైతులకు నష్టం లేకుండా కాలుష్యం తక్కువగా ఉండేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పరిశ్రమలకు కేటాయించిన భూములు, అందులో ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి వివరాలు అందజేయాలని రేవంత్ ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు.
ఆ దేశాల విధానాలు అధ్యయనం చేయాలి
బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై.. పశ్చిమాసియా, యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. అవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. దీనివల్ల ఆయా భూములకు ధరలు కూడా తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని పేర్కొన్నారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా బాలానగర్‌లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
👉 – Please join our whatsapp channel here –