రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఇటీవలి సైక్లోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మొదలైన చలితీవ్రత.. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఉదయం పదిగంటలైనా వీధుల్లో మంచుతెరలు తొలగడంలేదు. సాయంత్రం ఆరుదాటితే పొగమంచు కమ్మేస్తున్నది. రానున్న మూడురోజులు చలితీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. తూర్పు, ఆగ్నేయం వైపు నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రివేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయని, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఆదివారం పలు చోట్ల అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 13.1 డిగ్రీలు, మెదక్‌లో 14.3, రంగారెడ్డిలో 15.7, హైదరాబాద్‌లో 16.2, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 17 చొప్పున, నల్లగొండలో 17.4, నిజామాబాద్ 18.1, మహబూబ్‌నగర్ 20.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో 50 శాతం తేమ నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొన్నది
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం…బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. గాలుల ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అమరావతి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –