DailyDose

వచ్చే ఐదేళ్లలో నలభై వేలకు పైగా పదవీ విరమణలు

వచ్చే ఐదేళ్లలో నలభై వేలకు పైగా పదవీ విరమణలు

రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్‌ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్‌ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 చొప్పున ఉద్యోగులు విరమణ పొందనున్నట్టు సమాచారం. మొత్తంగా రాబోయే ఐదేండ్లల్లో 44,051 ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అంటే 10 శాతానికి పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో విరమణ పొందనున్నారు.

61 ఏండ్లకు పెంచిన కేసీఆర్‌ సర్కారు
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు, మరికొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలకశాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికితోడు ఏటా వేలాది ఉద్యోగులు విరమణ పొందాల్సి ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నతోద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ 2021 మార్చిలో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటినుంచి ప్రభుత్వ శాఖలతోపాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీల్లో (బోధనేతర సిబ్బంది) ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును సైతం 61కి పెంచింది. సింగరేణిలో కూడా మార్చి 31 నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి.

వివిధ రాష్ర్టాల్లో వయో పరిమితి ఇలా..

ఉద్యోగుల వయోపరిమితి పెంపు తెలంగాణతోపాటు 20 రాష్ర్టాల్లో ఆమల్లో ఉన్నది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 62 ఏండ్ల వయోపరిమితిని అమలు చేస్తుండగా, ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 61 ఏండ్లుగా ఉన్నది.

పశ్చిమబెంగాల్‌లో మెడికల్‌ ప్రొఫెసర్లకు 65 ఏండ్లు, డాక్టర్లకు 62, ఇతర ఉద్యోగులకు 60 ఏండ్ల వయోపరిమితిని అమలుచేస్తున్నారు.

ఏపీ, త్రిపుర, కర్ణాటక, అస్సాం, బీహార్‌, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, యూపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, పంజాబ్‌, ఒడిశా, రాజస్థాన్‌ లో 60 ఏండ్లు ఉండగా, తమిళనాడులో 59 ఏండ్ల వయోపరిమితిని వర్తింపజేస్తున్నారు.

హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, కశ్మీర్‌, మహారాష్ట్ర, గోవాలో 58 ఏండ్లు, కేరళ, జార్ఖండ్‌లో 56 ఏండ్లుగా విరమణ వయసు అమలవుతున్నది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z