Business

705 కోట్ల‌ను యూకో బ్యాంక్ రిక‌వ‌రీ-వాణిజ్య వార్తలు

705 కోట్ల‌ను యూకో బ్యాంక్ రిక‌వ‌రీ-వాణిజ్య వార్తలు

705 కోట్ల‌ను యూకో బ్యాంక్రిక‌వ‌రీ

ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ప‌లువురి ఖాతాల్లో పొర‌పాటున జ‌మ చేసిన రూ. 820 కోట్ల‌కు గాను రూ. 705.31 కోట్ల‌ను యూకో బ్యాంక్ (UCO Bank) రిక‌వ‌రీ చేసింద‌ని కేంద్ర ఆర్ధిక శాఖ స‌హాయ‌మంత్రి భ‌గ‌వ‌త్ క‌ర‌ద్ సోమ‌వారం వెల్ల‌డించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్‌లో సాంకేతిక లోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొర‌పాటున ఈ నిధుల బ‌దిలీ జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి న‌వంబ‌ర్ 15న యూకో బ్యాంక్ ఇద్ద‌రు స‌పోర్ట్ ఇంజ‌నీర్లు, గుర్తించలేని ఇత‌ర వ్య‌క్తుల‌పై సీబీఐ వ‌ద్ద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ఇక ప‌శ్చిమ బెంగాల్‌, క‌ర్నాట‌క‌లోని 13 ప్ర‌దేశాల్లో డిసెంబ‌ర్ 5న సీబీఐ సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్‌ల‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.డిజిట‌ల్ చెల్లింపుల‌కు సంబంధించి ఎదుర‌వుతున్న సైబ‌ర్ సెక్యూరిటీ స‌వాళ్ల‌పై న‌వంబ‌ర్ 28న కేంద్ర ఆర్ధిక శాఖ స‌మావేశ‌మైంది. ఈ భేటీలో బ్యాంకులు, ఆర్ధిక సంస్ధ‌ల స‌న్న‌ద్ధ‌త గురించి చ‌ర్చించామ‌ని ఆర్ధిక శాఖ స‌హాయ మంత్రి క‌ర‌ద్ పేర్కొన్నారు. సైబ‌ర్ దాడులు, డిజిట‌ల్ చెల్లింపుల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌లకు సంబంధించి దీటైన వైఖ‌రి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

* నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాకమార్కెట్లు స్వల్పనష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడుదొడుకుల మధ్యసారి చివరికి నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 21,418 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 168 పాయింట్లు నష్టపోయి 71,315 వద్ద స్థిరపడింది.అమెరికా మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, అక్కడి సూచీలు వరుసగా ఏడో వారం లాభాలు నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.9,232.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,077.43 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. ఈ వారం స్టాక్‌ మార్కెట్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ అధిక కొనుగోళ్ల జోన్‌లో ఉండడమే ఇందుకు కారణమంటున్నారు. పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వడ్డీరేట్ల తగ్గింపు దిశగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు, విదేశీ పెట్టుబడిదార్లలో ఉత్సాహం వంటి సానుకూలతల నేపథ్యంలో గతవారం అధిక కొనుగోళ్లు జరిగిన విషయం తెలిసిందే. అందువల్ల స్వల్పకాలంలో స్థిరీకరణకు అవకాశం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, బజాన్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకి, టైటాన్‌, టాటా స్టీల్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్టాక్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి.

*  ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు సబ్సిడీ ఇక లేనట్లేనా?

దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రెండో దశ (FAME-2) గడువు త్వరలో ముగియనుంది. టూవీలర్లు సహా మిగిలిన విద్యుత్‌ వాహనాలకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది. మరికొన్ని వారాల్లో దీని గడువు ముగియనున్న వేళ టూవీలర్‌ సబ్సిడీని ఇక మీదట పొడిగించకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.ఫేమ్‌-1కు కొనసాగింపుగా ఫేమ్‌-2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ కొనుగోళ్లపై సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించారు. గతంలో ఒక కిలోవాట్‌కు సబ్సిడీ ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.10 వేలకు కుదించింది. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. పథకాన్ని పొడిగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ, ఇతర మంత్రిత్వ శాఖలు మాత్రం విముఖత చూపుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌కు సబ్సిడీని తగ్గించిన తర్వాత కొన్నాళ్ల పాటు అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. సబ్సిడీ లేకపోయినా టూవీలర్‌ అమ్మకాలు వాటంతట అవే పెరుగుతాయని, పెట్రోల్‌ ధరలు అధికంగా ఉండడం వల్ల వాహనదారులు అటుగా మళ్లుతారని అధికార వర్గాల వాదన. మరోవైపు ఫేమ్‌-2 రాయితీ విషయంలో చోటు చేసుకున్న అవకతవకలూ సబ్సిడీ కొనసాగించకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్లను ప్రోత్సహించేందుకు మరో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

 ఫిబ్ర‌వ‌రిలో న‌థింగ్ ఫోన్ 2ఏ ఎంట్రీ

న‌థింగ్ ఫోన్ 2 కొన‌సాగింపుగా న‌థింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో లాంఛ్ కానుంది. 2024 ఫిబ్ర‌వ‌రిలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) వేదిక‌గా నథింగ్ ఫోన్ 2ఏ లాంఛ్ కానుంద‌ని టెక్ నిపుణులు యోగేష్ బ్రార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ డివైజ్ ధ‌ర 400 డాల‌ర్లు అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు రూ. 33,200 ఉంటుంద‌ని బ్రార్ అంచ‌నా.ఇక ప్రొడ‌క్ష‌న్ వ్యాలిడేష‌న్ టెస్ట్ (పీవీటీ) యూనిట్ ఇమేజ్‌ల‌ను కూడా బ్రార్ షేర్ చేశారు. పీవీటీ యూనిట్స్‌ను త‌యారీ ప్ర‌క్రియ‌లో డివైజ్ ప‌నితీరు హార్డ్‌వేర్ కాంపోనెట్స్‌, నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను అంచ‌నా వేసేందుకు ప‌రిమిత సంఖ్య‌లో త‌యారు చేస్తారు. న‌థింగ్ పోన్ 2ఏ ముందుభాగంలో పంచ్ హోల్ నాచ్ డిస్‌ప్లేతో పాటు బ్యాక్ ప్యానెల్‌లో టాప్ సెంట‌ర్‌లో హారిజంట‌ల్ కెమెరా మాడ్యూల్‌తో నావెల్ డిజైన్ ఆకట్టుకుంటుంది.భార‌త్‌లో ప‌లు మ‌ధ్య‌శ్రేణి ఫోన్ల‌లో చూసిన త‌ర‌హాలో అప్‌క‌మింగ్ న‌థింగ్ ఫోన్ 2ఏ 120హెచ్‌జ‌డ్ రిఫ్రెష్ రేట్ స‌పోర్ట్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్ ఆఫ‌ర్ చేస్తుంది. ఈ హాట్ డివైజ్ 6.7 ఇంచ్ ప్యానెల్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్‌సెట్ క‌లిగిఉంది. న్యూ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్‌లో న‌థింగ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆఫ‌ర్ చేస్తుంద‌ని చెబుతున్నారు. ఫోన్ వెనుక‌భాగంలో రెండు కెమెరాల్లో ఒక‌టి 50ఎంపీ కెమెరా ఉంటుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 6000 కోట్లు పెట్టుబడి

అదానీ గ్రూప్‌ యాజమాన్యంలోని అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ (Ambuja Cements Ltd) పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.6,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. 2025- 26 నాటికి ఈ మొత్తాన్ని వెచ్చించి 1,000 మెగావాట్ల సామర్థ్యాన్ని నెలకొల్పుతామని తెలిపింది.గుజరాత్‌లో 600 మెగావాట్ల సౌర ఇంధనం, 150 మెగావాట్ల పవన విద్యుత్‌; రాజస్థాన్‌లో 250 మెగావాట్ల సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements Ltd) తెలిపింది. ఈ కంపెనీ క్రమంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. ఏటా 140 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, తమ ఇంధన అవసరాల్లో 60 శాతం హరిత మార్గంలో సమకూర్చుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే తాజా పెట్టుబడులను ప్రకటించింది.వచ్చే దశాబ్ద కాలంలో హరిత ఇంధన ప్రాజెక్టుల్లో 100 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తామని అదానీ గ్రూప్‌ గతంలో ప్రకటించింది. 2050 నాటికి గ్రూపులోని ఐదు కంపెనీలు తటస్థ కర్బన ఉద్గార స్థాయిని అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. వీటిలో అంబుజా సిమెంట్స్‌ సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, ఏసీసీ ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z