Business

ఈ రెండు రకాల వాచ్‌ల విక్రయాలను యాపిల్‌ నిలిపివేసింది!

ఈ రెండు రకాల వాచ్‌ల విక్రయాలను యాపిల్‌ నిలిపివేసింది!

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్ (Apple) ఉరుకులు పరుగులు పెడుతోంది. వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2లో వీలైనంత వేగంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు వాచ్‌లలో బ్లడ్‌ ఆక్సిజన్‌ స్థాయిలను కొలిచే ఫీచర్‌ విషయంలో తమ పేటెంట్‌ను యాపిల్‌ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్‌ దావా వేసింది. ఈ వాచ్‌లపై ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ITC) విధించిన నిషేధ ఆదేశాలు డిసెంబర్‌ 25 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఐటీసీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఈ రెండు రకాల వాచ్‌ల విక్రయాలను యాపిల్‌ నిలిపివేసింది. వాటి ప్రచార, ఆన్‌లైన్‌ విక్రయాలను సైతం ఆపేసింది. ఈ ఫీచర్‌తో సంబంధం లేని ఎస్‌ఈ శ్రేణి వాచ్‌ల విక్రయాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది. మరోవైపు వీలైనంత వేగంగా బ్లడ్‌ ఆక్సిజన్‌ ఫీచర్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేపట్టేందుకు యాపిల్‌ ఇంజినీర్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఒకవేళ నిషేధం ముప్పు ఎదుర్కొంటే యాపిల్‌కు 17 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. శ్వేతసౌధం జోక్యం చేసుకుంటే నిషేధం ముప్పు తప్పే అవకాశం ఉంది.

పేటెంట్‌ ఉల్లంఘనపై దావా వేసిన ‘మాసిమో’ మాత్రం వాచ్‌లలో కేవలం సాఫ్ట్‌వేర్‌ మార్పులు చేపడితే సరిపోదని వాదిస్తోంది. ఆక్సిజన్‌ స్థాయిలను కొలిచే హార్డ్‌వేర్‌ విషయంలోనూ తమకు పేటెంట్‌ ఉందని గుర్తుచేస్తోంది. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ మార్పుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని యాపిల్‌ ఆశిస్తోంది. ఒకవేళ హార్డ్‌వేర్‌లోనూ మార్పులు చేయాల్సి వస్తే యాపిల్‌కు మరో మూడు నెలలు గడువు లభించే అవకాశం ఉంది. కేవలం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కంపెనీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో యాపిల్‌ నిషేధం ముప్పు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో దాని షేర్లు సైతం స్వల్పంగా కుంగాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z