అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శ్వేతసౌధానికి రెండోసారి చేరుకోవాలన్న ట్రంప్ ఆశలకు ఈ తీర్పు బ్రేకులు వేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. కొలరాడో సుప్రీంకోర్టు 4-3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.
2021 జనవరి 6 నాటి దాడిని ట్రంప్ ప్రేరేపించినట్లు గతంలో కొలరాడోలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ధ్రువీకరించింది. అయితే, అందుకు ట్రంప్‌ను అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని నాడు డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఆ తీర్పును ఇప్పుడు కొలరాడో ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైమరీలో పోటీపడేందుకు అనర్హుడని తేల్చింది.
తాజా తీర్పుతో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడోలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఉండరు. దీంతో వచ్చే ఏడాది నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఈ తీర్పు పెను ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుపై ట్రంప్ అటార్నీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది.
👉 – Please join our whatsapp channel here –