* హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ.. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 6న మల్లారెడ్డిపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమకు వారసత్వంగా రావాల్సిన భూమి వచ్చేలా చేస్తామని మభ్యపెట్టి పీటీ సరెండర్ (ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం) చేశారని ఆరోపిస్తూ కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి గత నెల 18న ఇచ్చిన ఫిర్యాదుపై శామీర్‌పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, శివుడు, స్నేహా రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై ఐపీసీ 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-2015లోని 3(1)జీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 33, 34, 35లలోని 47 ఎకరాల 18 గుంటల భూమి రాజీ అనే మహిళ పేరిట ఉంది. ఆమెకు భిక్షపతి సహా ఏడుగురు వారసులున్నారు. తమకు వారసత్వంగా చెందాల్సిన భూమి తిరిగి తమ అధీనంలోకి వచ్చేలా చేస్తామని నిందితులు మభ్యపెట్టారని.. తమకు తెలియకుండా గత నెల 3న మూడుచింతలపల్లి తహసీల్దార్ సమక్షంలో పీటీ సరెండర్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
* లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం
రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేషనల్ అలయెన్స్ కమిటీ కన్వీనర్‌గా ముకుల్ వాస్నిక్‌ను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించారు. సభ్యులుగా అశోక్ గెహ్లోత్, భూపేష్ భగేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాశ్ లను నియమించినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా మరికొద్ది సేపట్లో ఇండియా కూటమి సమావేశం అవుతుందనగా కాంగ్రెస్ అధిష్టానం నేషనల్ అలయెన్స్ కమిటీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
* కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ అప్రమత్తం
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్‌గా ఇప్పటికే రెగ్యులర్‌గా ఫీవర్సర్వేను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.సెకండ్ వేవ్ సమయంలోనే ముందస్తు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ చర్యలతో రాష్డ్ర వ్యాప్తంగా 40 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజుకి 60 వేలకి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది. మరోసారి ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.కోవిడ్ విషయంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్డ్రాలకి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుదాన్ష్ పంత్ సోమవారం లేఖ రాశారు. కేరళలో వెలుగుజూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జెఎన్1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న(సోమవారం) ఒక్కరోజే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు.
* ఏడాది వర్షపాతం ఒక్కరోజులోనే
తమిళనాడును భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తాయి. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలైన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారిల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. తిరునెల్వేలి, తూత్తుకుడిల్లో ఏడాది వర్షపాతం.. ఒక్కరోజులోనే నమోదైందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. వరదలతో ఈ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చించేందుకుగానూ దిల్లీకి వెళ్లిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తూత్తుకుడిలో సహాయక చర్యలను బుధవారం స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ‘‘డిసెంబరు 17, 18 తేదీల్లో వాతావరణశాఖ అంచనా వేసిన దానికంటే భారీ వర్షాలు కురిశాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో గత 47-60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసింది. ఒక్క కాయల్పట్టినంలో 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 13 వేల మందిని శిబిరాలకు తరలించాం. హెలికాప్టర్ల ద్వారా నిర్వాసితులకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. సైన్యం సాయం కూడా కోరాం’ అని సీఎం స్టాలిన్ వివరించారు.ఇటీవల చెన్నై సహా నాలుగు జిల్లాలను మిగ్‌జాం తుపాను కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ‘‘తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12,059 కోట్లు, మధ్యంతర సాయంగా మరో రూ.7,033 కోట్లు కోరాం. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా నాలుగు జిల్లాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందించాం. కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందిస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టగలం’’ అని తెలిపారు. ఈ విషయంతోపాటు దక్షిణాది జిల్లాల్లో జరిగిన వరద నష్టాలను ఆయన ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
* గోదావరి జిల్లాల లిస్ట్ పై జగన్ ఫోకస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలకు స్థాన చలనం, లేకుంటే టికెట్ ఇవ్వలేమని తెగేసి చెప్పేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానచలనం కల్పించారు సీఎం వైఎస్ జగన్. అంతేకాదు కొందరికి టికెట్ లేదని తేల్చి చెప్పేశారు. ముగ్గురు మంత్రులకు సీఎం వైఎస్ జగన్ స్థాన చలనం కల్పించడం సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఇన్‌చార్జిల మార్పుల వ్యవహారం రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన, టీడీపీలకు మాంచి పట్టుంది. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలనే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉభయగోదావరి జిల్లాలో పలు సర్వేలలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారికి టికెట్ ఇవ్వలేమని ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ‘టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడద్దని…ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటాం’ అని హామీ ఇచ్చి బుజ్జగించి పంపినట్లుగా ప్రచారం జరుగుతుంది.
* ఐపీఎల్ వేలంలోనే ఆల్‌టైమ్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రూ. 20.5 కోట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్‌ను రూ. 14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. భారత పేసర్ హర్షల్ పటేల్‌ను రూ. 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీ సాధించి ఆసీస్‌ను గెలిపించిన ట్రావిస్ హెడ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 6.8 కోట్లకు దక్కించుకుంది. ఆల్‌రౌండర్ వనిందు హసరంగను కూడా రూ. 1.5 కోట్లకు తీసుకుంది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను రూ. 4.2 కోట్లు పెట్టి పంజాబ్ దక్కించుకుంది. శార్దూల్‌ను (రూ. 4 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.1.50 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో సొంతం చేసుకుంది.
* కొత్తగా 142 కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,318 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా, రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది.ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 10 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. దేశంలో సోమవారం కొత్తగా 260 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
* 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యుగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యువగళం పాదయాత్ర సాఫీగా సాగకూడదనే ఉద్దేశంతో అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. పాదయాత్రలో లోకేశ్ ప్రజలతో మమేకం అయ్యారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర జరిగింది అని మాజీమంత్రి గంటా తెలిపారు. అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అని చెప్పుకొచ్చారు. నవశకం సభ నుండే ఎన్నికల సంఖారావాన్ని పూరించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోంది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారు అని మండిపడ్డారు. ఎన్నికల ముందు విశాఖకు వస్తానని సీఎం జగన్ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని…మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –