Movies

‘సలార్‌’ టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

‘సలార్‌’  టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘సలార్‌’ (Salaar) టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్‌ థియేటర్లలో రూ.65 పెంచుకునేలా అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు, భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల విషయంలో.. నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌ ధరలను పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ‘సలార్’ను తెలుగులో విడుదల చేయనున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ విజ్ఞప్తి చేయగా… సినిమా విడుదలైన రోజు (డిసెంబరు 22) నుంచి డిసెంబరు 28 వరకు టికెట్‌ ధరల పెంపునకు టీఎస్‌ గవర్నమెంట్‌ వెసులుబాటు కల్పించింది. అలాగే, రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షో కు అనుమతి ఇచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు, టికెట్ విక్రయాలు ప్రారంభంకావడంతో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్యా థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో బారులుతీరారు.

ప్రభాస్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. శ్రుతిహాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో ఈ సినిమా రూపొందింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z