Politics

శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నది.

‘తెలంగాణ రాష్ట్ర ఆర్థి క పరిస్థితులు- శ్వేతపత్రం’ అంశంపై లఘు చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని, ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం తమ వాదనను బలంగా వినిపించేందుకు ‘పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌’ను (పీపీటీ) మార్గంగా ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పీపీటీ ప్రదర్శనకు అసెంబ్లీలో ప్రత్యేకంగా టీవీలు, ప్రొజెక్టర్‌ ఏర్పా టు చేశారని సమాచారం.

ఆర్థిక స్థితిపై పోస్ట్‌మార్టం!
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పు ల కుప్పగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారం నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం.

ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ఆర్థిక రంగ నిపుణులు, పలువురు ప్రస్తుత, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొన్ని రోజులుగా తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయా లు, నిధుల సమీకరణ, కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల లెక్కలను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీంతోపాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి.

ఏ ఏడాది.. ఏ పథకం కింద.. ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి? ఎంత వినియోగించారు? ఏవైనా నిధులను మళ్లించారా? వంటి వివరాలపై ఆరా తీశారు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం.. ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఈ శ్వేతపత్రాన్ని ప్రభు త్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది. శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టి, వివరాలను తెలియజేస్తారా? లేదా సీఎం రేవంత్‌రెడ్డి సభ ముందు ఉంచుతారా? అనే చర్చ జరుగుతున్నది.

కౌంటర్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ రెడీ
ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. పార్టీ తరఫున మాజీ ఆర్థిక మం త్రి హరీశ్‌రావు సమాధానం ఇవ్వనున్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం సాధించిన ప్రగతిని వివరించనున్నారు. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా వివరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందంతో సమగ్ర నివేదిక తయారు చేయించినట్టు సమాచారం.

జీఎస్డీపీ, తలసరి ఆదా యం, సొంత పన్నుల రాబడి ఎలా పెరిగాయో తెలియజేయనున్నారు. ప్రభుత్వం సేకరించిన నిధులను మూలధన పెట్టుబడిగా ఏయే రంగాల్లో ఖర్చు చేసిం దో, వాటి వల్ల ఆయా రంగాల్లో జరిగిన ప్రగతి ఏమి టో వివరించనున్నారు. ఏయే పథకాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ప్రయోజనం కలిగిందో చెప్పనున్నారు. ఆ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో వచ్చిన మార్పును వివరించాలని నిర్ణయించారు.

శాఖలవారీగా ఆయా రంగాల్లో వచ్చిన మార్పును మరోసారి ప్రజల కండ్లకు కట్టే ప్రయత్నం చేయనున్నారు. ఒకప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఏ విధంగా చేరింది? ఇందుకు వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం చేసిన వ్యయం వంటివి సమగ్రంగా వివరించనున్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న కాంగ్రెస్‌ వాదనలను తిప్పికొట్టనున్నారు. ఈ మేరకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కూడా సిద్ధం చేశారు.

శ్వేతపత్రంపై లఘు చర్చ
అసెంబ్లీ మొదటి సమావేశాల ఐదోరోజు సందర్భంగా సంతాప ప్రతిపాదనలు, లఘు చర్చ నిర్వహించనున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనున్నది. అనంతరం ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు-శ్వేతపత్రం’పై లఘు చర్చ జరుగనున్నది. అధికార, ప్రతిపక్షాలకు ఇద్దరికీ అవకాశం లభిస్తే.. అసెంబ్లీలో ఇలా ఒక అంశంపై అధికార ప్రతిపక్షాలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇవ్వటం ఇదే మొదటిసారి అవుతుంది.

మాకూ అవకాశం ఇవ్వండి: హరీశ్‌రావు
శాసనసభలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కోసం ప్రధాన ప్రతిక్షమైన బీఆర్‌ఎస్‌కూ అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శాసన సభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు హరీశ్‌రావు వినతిపత్రం సమర్పించారు. ‘బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్తు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం ఉన్నది.

ఒకవేళ ప్రభుత్వానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు అనుమతి ఇచ్చినట్టయితే, దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వివరణ (మా వెర్షన్‌) కూడా చెప్పాల్సి ఉంటుంది. మేము కూడా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కావున దయచేసి మా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షానికి కూడా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వగలరని మనవి’ అని హరీశ్‌రావు వినతిపత్రంలో పేర్కొన్నారు.

హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్ర డ్రామాలు: కేటీఆర్‌
ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్‌ నాయకులు శ్వేత పత్రాల డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఇచ్చి న ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని మంగళవారం ఆయన ట్విట్టర్‌వేదికగా కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని కేటీఆర్‌ చెప్పారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్‌ పత్రాలన్ని ఆస్తులు.. అప్పులు.. ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తాము విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక.. ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని, ఆడిట్‌ రిపోర్ట్‌లు, ఆర్బీఐ నివేదికలు ప్రతిపైసాకు లెకా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిషరించాయని చెప్పారు. కాంగ్రెస్‌ శోధించి సాధించేది ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులపై నాడే కేసీఆర్‌ పీపీటీ
తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే అసెంబ్లీలో అద్భుతమైన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ప్రసారమైంది. సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలోని నీటి వనరులు, ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉన్న ప్రాజెక్టులపై కేసీఆర్‌ పీపీటీ ద్వారా వివరించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యతకపై సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పూసగుచ్చినట్టు తెలిపారు. ఒక రాజకీయ నాయకుడికి భౌగోళిక, ఆర్థిక, ఇంజినీరింగ్‌ అంశాలపై ఇంతటి అపార అవగాహన ఉండటం అద్భుతమని నాడు నిపుణులు కేసీఆర్‌ను కొనియాడారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z