Agriculture

రొయ్య రైతు బతికేదెలా?

రొయ్య రైతు బతికేదెలా?

అప్పుడు
రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపి మీసం మెలేశాడు ఆంధ్రప్రదేశ్‌ రైతు. ఎగుమతుల్లో కీలకపాత్ర పోషించి.. విదేశీ మారకద్రవ్యం రాబట్టాడు.

ఇప్పుడు
అప్పుల వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. విదేశీ ధరలతో పోటీ పడలేక చైనాకు ఎగుమతుల విషయంలో చేతులెత్తేశాడు! ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి.. మద్దతు ధర తెలిపి అండగా నిలవాలి. రాయితీలిచ్చి ప్రోత్సహించాలి. మరి వైకాపా సర్కార్‌ ఏం చేస్తోంది… నాలుగేళ్లుగా మద్దతు ధరను తగ్గిస్తూ వచ్చింది. దాన్నీ అందరికీ అమలుచేయడం మానేసింది. విద్యుత్‌ రాయితీలనూ ఎత్తేసింది. ఆపై ట్రూ అప్‌ పేరుతో కరెంట్‌ షాక్‌ ఇస్తోంది. చివరకు ఆక్వా రైతుని కుయ్యో మొర్రో అనే స్థితికి చేర్చింది.

ఆక్వా రైతులకు మూడేళ్లుగా.. అష్టకష్టాలే. రొయ్యకు ధర లేదు. ఎగుమతులూ తగ్గిపోయాయి. సాగు చేద్దామన్నా అప్పు ఇచ్చే పరిస్థితీ లేదు. ఏ రైతును కదిలించినా రూ.25-30లక్షల అప్పులతో మునిగిపోయామనే ఆవేదనలే. ఆంధ్రప్రదేశ్‌ను రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన మన రైతు.. 2020 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆక్వా రైతును ఆదుకుంటామని, రొయ్యకు మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామని.. ఎన్నికల ముందు ఎక్కడా లేని ప్రేమ ఒలకబోసిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు సరికదా.. మరింత కష్టాల్లోకి నెట్టేశారు. రాయితీపై విద్యుత్తు సరఫరా చేస్తామని ఆశపెట్టి.. కొందరికే పరిమితం చేశారు. కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రొయ్యల రైతులు.. సాగు అంటేనే భయపడుతున్నారు. సాగు మానుకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్పితే ఉపశమన చర్యలే లేవు.

100 కౌంట్‌ రొయ్య కిలో ఉత్పత్తి చేయాలంటే.. అన్ని ఖర్చులూ కలిపి రూ.275 వరకు అవుతుంది. ఇప్పుడు మార్కెట్‌ ధర రూ.210-215 మాత్రమే ఉంటోంది. 30 కౌంట్‌ రొయ్య ధర రూ.370 మాత్రమే. కనీసం రూ.500 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. రైతు తానుగా రొయ్యలు అమ్ముతానంటే మరింత తక్కువకు అడిగే పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో మూడు పంటలు వేస్తే.. సరిగా చేతికి వచ్చేది ఒక పంటే. మార్కెట్‌కు ఒకేసారి పంట వచ్చినప్పుడు సిండికేట్‌గా ఏర్పడి.. ధరని మరింత తగ్గిస్తున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత పంటకాలంలో వచ్చిన నష్టాన్ని ఈ పంటలో పూడ్చుకోవచ్చని.. ఆశల సాగు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు ధరలో కోత పడుతూనే ఉంది. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ధరలు ఎందుకు తగ్గుతున్నాయనే సమీక్షలు కూడా లేవు. రొయ్యల దాణా, మందుల ధరలు భారీగా పెరిగినా.. ప్రభుత్వ నియంత్రణ కొరవడింది.

ట్రూ అప్‌ బాదుడు
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు విద్యుత్తు ఛార్జీలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. మూడున్నర ఎకరాల చేపల చెరువుకు.. రెండేళ్ల కిందట ఓ రైతుకు విద్యుత్‌ బిల్లు రూ.700 మాత్రమే వచ్చేది. ఇప్పుడు మోటారు వేయకుండానే రూ.3వేల బిల్లు చెల్లిస్తున్నారు. 11 ఎకరాల చెరువుకు గతంలో రూ.25వేలు బిల్లు కట్టిన ఓ రైతు ఇప్పుడు రాయితీపోను రూ.80వేలు కడుతున్నాడు. ట్రూ అప్‌ పేరుతో బాదుడు విపరీతంగా ఉంది. రాయితీ కనెక్షన్ల సంఖ్య కూడా గతేడాది నుంచి తగ్గించారు.

కిలోకు రూ.60 నష్టమే
ఆక్వా రైతులు కిలోకు నికరంగా రూ.60 వరకు నష్టపోతున్నారు. ఎకరాకు 2.5 టన్నుల సగటు దిగుబడి ప్రకారం చూస్తే.. రూ.1.5 లక్షల మేర ఒక పంటకాలంలో నష్టం వస్తోంది. అంటే అయిదెకరాల చెరువుకు రూ.7.5లక్షల పైనే నష్టం. వైరస్‌, వ్యాధుల్లాంటివి వస్తే.. ఖర్చులూ చేతికి రావు. నష్టం ఇంకా పెరుగుతుంది. 2020 సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. ఇదిగో ఈ ఏడాది ధర వస్తుందంటూ ఆశగా సాగు చేస్తున్న రైతులకు.. ఏటికేడు నష్టాలే మిగులుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి తప్పితే ఆదాయం రావడం లేదు.

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈక్వెడార్‌
రొయ్యల ఎగుమతిలో మన రైతుకు.. ఈక్వెడార్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మనకంటే తక్కువ ధరకే ఎగుమతి చేసేందుకు ఆ దేశం ముందుకొస్తోంది. మూడేళ్లుగా ఉత్పత్తిని భారీగా పెంచుకుంది. దీంతో చైనా తదితర దేశాలకు మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో 100 కౌంట్‌ రొయ్య ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యేది. మొత్తం దిగుమతుల్లో 55% ఈక్వెడార్‌ నుంచి ఉండగా.. భారత్‌ నుంచి అందులో సగంలోపే ఉంటోందని రైతులు వాపోతున్నారు.

అప్పు పుట్టదు…
రాష్ట్రంలో రొయ్యల సాగు 1.90లక్షల ఎకరాలు ఉండేది. గత మూడేళ్లలో సాగు విస్తీర్ణం 20% తగ్గినట్లు అంచనా. చిన్న రైతుల్లో అధికశాతం సాగు మానుకుంటున్నారు. మరికొందరు సగం రొయ్య, సగం చేపలు వేస్తున్నారు. రెండేళ్లలో దాణా ధరలు సగటున 35% పైగా పెరిగాయి. కిలో మేత ధర రూ.90 పైగా చేరింది. రైతులు తమకు అవసరమైన రొయ్యల దాణా, ఇతర ఉత్పత్తుల్ని.. స్థానికంగా ఉండే వ్యాపారుల నుంచి అరువుకు తీసుకుంటారు. రొయ్య అమ్మకం తర్వాత సొమ్ము జమ చేసేవారు. అయితే రెండేళ్లుగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. రెండు, మూడు పంటలకు కూడా తీర్చలేకపోతున్నారు. దీంతో అరువు ఇవ్వలేమంటూ వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. గతేడాది నుంచి చాలాచోట్ల సరఫరా నిలిపేశారు. దీంతో చిన్నరైతులు సాగు చేయలేక.. చెరువుల్ని ఎండగట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మొత్తంగా ఆక్వా రంగాన్నే అస్తవ్యస్తంగా తయారు చేసిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z