వైకాపా ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ.. ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహిత కంపెనీగా పేరుపడిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప శివారులోని పారిశ్రామికవాడలో ఉన్న ఆ సంస్థకు చెందిన కర్మాగారం, హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో సైతం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
కడపలోని కర్మాగారంలో విద్యుత్తు స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తున్నారు. నగరంలోని రిమ్స్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టింది. రూ.వేల కోట్ల విలువైన అనేక భారీ ప్రాజెక్టులతో పాటు రైతుల వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు స్మార్ట్ మీటర్లు సమకూర్చే పనులనూ అప్పగించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే సంస్థ ఆర్థికంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టడం గమనార్హం. తనిఖీల సమయంలో ఐటీ అధికారులు పలు దస్త్రాలను పరిశీలించినట్లు తెలిసింది.
👉 – Please join our whatsapp channel here –