DailyDose

డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం-నేర వార్తలు

డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం-నేర వార్తలు

డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం

న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణలో శ్రీనివాస్‌ రెడ్డికి బదులు మరొకరిని హాజరుపరిచినట్లు తెలుసుకుని ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ధర్నా కేసులో శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవటంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు శ్రీనివాస్‌ రెడ్డి కోర్టులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాలతో శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే కోర్టు ముందు హాజరయ్యారు. ఆయనను జడ్జి మందలించారు.

*   బస్‌భవన్‌ను ముట్టడించిన ఆటో కార్మికులు

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బీఎంఎస్‌ (BMS) ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) వల్ల తమకు గిరాకీ పడిపోయిందని కార్మికులు, గతంలో రోజుకు రూ.1000 నుంచి రూ.1500 సంపాదించేవారమని, ఇప్పుడది రూ.400లకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, కనీసం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామని చెప్పారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజు రూ.1000 వరకు గండి పడిందని బీఎంఎస్‌ అనుబంధ తెలంగాణ స్టేట్‌ ఆటో అండ్‌ ట్యాక్సీ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఇబ్బంది కలుగకుండాచర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇదే విషయమై అన్ని జిల్లాల్లో ఆటో కార్మికులు రోడ్లెక్కుతున్న విషయం తెలిసిందే.

సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్య

తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్‌, ఐదు సెల్‌ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్‌ పీఎస్‌లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.నవంబర్‌ 29న మాక్లూర్‌ మండలంలో ప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్‌, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్‌ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్‌ జైలులో ఉన్నాడని ఆయన్ని కలుద్దామని చెప్పి.. ఈ నెల 1న ఆయన భార్య శాన్వికను ప్రశాంత్‌ నిజామాబాద్‌ తీసుకెళ్లాడు. బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున ప్రసాద్‌ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్‌ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్‌ వద్దకు వెళ్దామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్‌ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్‌ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్‌ 4న తమ్ముడితో కలిసి పిల్లల్ని ప్రశాంత్‌ చంపేసి..  మెండోర వద్ద సోన్‌ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్‌ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్‌ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది’’ అని సింధు శర్మ వివరించారు. ఆమె కోసం వచ్చిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద ప్రశాంత్‌, మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్‌ వద్ద లభించాయని, ఇప్పటి వరకు 4 మృతదేహాలు లభించగా.. ప్రసాద్‌, ఆయన భార్య మృతదేహాలు లభ్యం కాలేదని ఎస్పీ తెలిపారు.

సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు

నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.15 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదా శివనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడిందని ఎస్పీ పేర్కొన్నారు. నవంబర్ 29న ప్రసాద్ ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. హత్యలు చేయడానికి వాడిన కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు నగదు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు ఎస్పీ చెప్పారు. ఫోన్లు కూడా మృతులవేనని తెలిపారు. ఆస్తి కోసమే ఈ హత్యలు చేశారు ఎస్పీ పేర్కొన్నారు.ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రాథమిక విచారణ అని.. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు

*  యువకుడి సెల్ఫీ వీడియో కలకలం

ఓ యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి వాటికి బానిగా మారాడు. ఆ వ్యసనాన్ని మానుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారి కలకలం సృష్టిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన చిలుకూరి ప్రసాద్ అనే యువకుడు ఈ వీడియోను రిలీజ్ చేశాడు. ఆన్‌లైన్ గేమ్స్‌‌కు అలవాటు పడటంతో తండ్రి మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థానం చెందిన ప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే తను ఇలా తయారు కావడానికి తన తండ్రే కారణమని ఆ యువకుడు వీడియోలో ఆరోపించాడు. ఆన్‌లైన్ గేమ్స్‌ను అలవాటు చేసింది తన తండ్రే అని , దానికి బానిసై చనిపోవడానికి సిద్ధమయ్యానని తెలిపాడు. నేను మీకు ఎవరికి దొరకుండా వెళ్లి చనిపోతానని, తనను ఎవరూ పట్టుకోలేరని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో యాదాద్రి జిల్లాలో వైరల్‌గా మారింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిలుకూరి ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకు హైకోర్టు కీలక ఆదేశాలు

ఆయేషా మీరా హత్య కేసు వివరాలు తమ ముందు ఉంచాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు వేధిస్తున్నారని సత్యంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 2018 నుంచి నేటి వరకు వివరాలు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.కాగా పదినేళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. డిసెంబర్ 27, 2007న విజయవాడ ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్‌లో ఆయేషా మీరా హత్య జరిగింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమను కాదన్నందుకే హత్య చేశానని ఓ వ్యక్తి రాసిన లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు. పలువురి నిందితులను విచారించారు. చివరకు సత్యం బాబు అరెస్ట్ చేశారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు 2008లో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే కోర్టు సత్యంబాబుకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు సుధీర్ఘంగా విచారించిన ధర్మాసనం మార్చి 31,2017లో సత్యంబాబును నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు కేసును మరోసారి సీబీఐకి అప్పగించింది.అయితే కేసులో సాక్ష్యాలు దొరకపోవడంతో సీబీఐ అధికారులు విచారణలో పెద్దగా వేగం పెంచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయేషా మీరా సమాధిని తవ్వి రీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాక్షుల విచారణను సీబీఐ పూర్తి చేశారు. కానీ నేరస్తులెవరో ఇంత వరకూ గుర్తించలేకపోయారు. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనను విచారణ పేరుతో వేధిస్తున్నారని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ మేరకు కేసు వివరాలు తమ ముందు ఉంచాలని సీబీఐకి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తల్లడిల్లిన తల్లి హృదయం

ఏ వ్యాధి సోకిందో? ఏం జరిగిందో తెలీదు కానీ.. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న రెండేళ్ల బాబు అస్వస్థతకు లోనయ్యాడు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డకు తన చేతుల్లోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. విగతజీవిగా మారిన పసిబిడ్డను పట్టుకుని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది.యలమంచిలి ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలియజేసిన వివరాలు.. ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లులో నివాసముంటున్న కర్రి కుమారి రెండేళ్ల కుమారుడు చెర్రీ కొంతకాలంగా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తీసుకెళ్లి బస్సులో పెనుగొల్లు వస్తుండగా యలమంచిలి సమీపాన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. తల్లి కుమారి తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తాపత్రయంతో యలమంచిలిలో బస్సు దిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది.అయితే అప్పటికే చెర్రీ మృతి చెందినట్టు డ్యూటీ డాక్టర్‌ సుభాష్‌ ధ్రువీకరించారు. ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డకు చికిత్స చేయించినా రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయని తల్లి కుమారి గుండెలు బాదుకుంటూ విలపించింది. తన కొడుకుని బతికించమని వేడుకుంటూ చూపరులను కంటతడి పెట్టించింది. మృతి చెందిన చెర్రీ తండ్రి తాతాజీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. భార్య కుమారితో విభేదాల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి వచ్చేవరకూ చెర్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుదరదంటూ భర్త తరపు వారు ఆస్పత్రి వద్ద భార్య, ఆమె కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. కారులో మృతదేహం తరలింపును అడ్డుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z