Business

రాష్ట్రవ్యాప్తంగా కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో నిల్చునే పరిస్థితీ ఉండటం లేదు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేశారు. పాసులు ఉన్న వారిని మినహాయిస్తే 48.5 లక్షల మందికి ఆర్టీసీ టికెట్‌ జారీ చేసింది. వీరిలో 30.16 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో సుమారు 40 శాతం వనితలు ఉండేవారని ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌మెంట్‌తో కలిపితే ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో మూడు ఆర్టీసీ జోన్లలో సోమవారం బస్సులు 33.36 లక్షల కి.మీ. తిరిగాయి. అత్యధికంగా కరీంనగర్‌ జోన్‌లో 14.49 లక్షలు, హైదరాబాద్‌ జోన్‌లో 10.93 లక్షలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 7.94 లక్షల కి.మీ. చొప్పున తిరిగాయి. డిసెంబరులో ఇప్పటి వరకు 4వ తేదీన బస్సులు ఎక్కువ దూరం(34.16 లక్షల కి.మీ.) తిరిగితే వచ్చిన ఆదాయం రూ.21.04 కోట్లు. 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. 18న బస్సులు తిరిగింది 33.36 లక్షల కిలోమీటర్లే. అయినా రూ.21.10 కోట్ల ఆదాయం రాగా ఆక్యుపెన్సీ రేషియో 97.31 శాతానికి పెరిగింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z