భారతీయ యువతలో అత్యధికులు ఉన్నత విద్య.. అటుపై కొలువుల కోసం అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు వెళుతున్నారు. భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని విదేశాల్లో పీజీ, రీసెర్చ్ కోర్సులు చదువడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు బ్రిటన్ వంటి కొన్ని దేశాలు విద్యార్థులతోపాటు వారి డిపెండెంట్లకు వీసా కల్పించాయి. కానీ, ఇక ముందు బ్రిటన్‌కు డిపెండెంట్ వీసాపై విద్యార్థుల తల్లిదండ్రులు గానీ, జీవిత భాగస్వాములు గానీ, పిల్లలు గానీ వెళ్లడానికి కుదరదు. రోజురోజుకు విదేశీ విద్యార్థుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకున్నది.
2024 జనవరి నుంచి నాన్ రీసెర్చి కోర్సుల్లో పీజీ చేయడానికి వచ్చే విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను తీసుకురావడానికి అనుమతి నిరాకరిస్తూ బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులు తమ జీవిత భాగస్వాములతోపాటు పిల్లలను వెంట తీసుకొచ్చుకునేందుకు బ్రిటన్ డిపెండెంట్ వీసా పాలసీ అనుమతి ఇచ్చింది. పీజీ కోర్సుల విద్యార్థులకు మాత్రమే అనుమతించింది బ్రిటన్.
పీహెచ్డీ, పీజీ రీసెర్చ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మాత్రమే తమ వెంట డిపెండెంట్ పార్టనర్, పిల్లలను తెచ్చుకోవడానికి 2024 జనవరి ఒకటో తేదీ నుంచి బ్రిటన్ విద్యార్థి వీసా నిబంధన అనుమతి ఇస్తుంది. ఒక్కో దేశం నుంచి మరో దేశానికి ‘డిపెండెంట్’ నిర్వచనం మారుతుంది. ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనలకు అనుగుణంగా డిపెండెంట్ నిర్వచనం ఉంటుంది. బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్‌పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్‌గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు.
లీగల్ రెసిడెన్స్, అడల్ట్ డిపెండెంట్లకు వర్క్ రైట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) ద్వారా హెల్త్ కేర్ సేవలు, డిపెండెంట్ పిల్లలకు విద్యావకాశాలు, ప్రాధమిక వీసాదారుడి వీసా గడువు వరకు బ్రిటన్ వ్యాప్తంగా పర్యటించడానికి అనుమతి ఇస్తారు. తాజాగా బ్రిటన్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యాభ్యాసానికి బ్రిటన్‌ను ఎంచుకునే విషయమై వెనుకంజ వేస్తారని అంటున్నారు. అయితే, బ్రిటన్‌లో ఒక ఏడాది లోపే పీజీ కోర్సు పూర్తవుతున్నందున తాజా నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని కూడా చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –