DailyDose

సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం-నేర వార్తలు

సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం-నేర వార్తలు

* సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం

శంషాబాద్‌ సన్‌రైజ్‌ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందింది. రెండురోజుల క్రితం నిర్మల అనే మహిళ.. అనారోగ్య కారణంతో సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్‌ అయింది. అయితే.. నిన్న రాత్రి పరిస్థితి విషమించి ఆ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల మృతి చెందిందంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పతి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

* ఢిల్లీ మెట్రోలో ఘర్షణ

ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడ‌ప్పుడూ స‌ర‌దా సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. చిన్నచిన్న కార‌ణాల‌కే కొంద‌రు గొడ‌వ‌ప‌డుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ఇప్పటికే అనేకం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన ఘర్షణ (fighting) చోటు చేసుకుంది.రద్దీగా ఉన్న రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. బాక్సింగ్‌ క్రీడ (boxing match) తరహాలో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ ఇద్దరినీ నిందించగా.. మరికొందరేమో వీరిని ఒలింపిక్స్‌కు పంపాలంటూ చమత్కరిస్తున్నారు.

జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణం

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో అమానవీయ సంఘటన జరిగింది. వారం రోజులు క్రితం ఓ ఇంట్లో మహిళ చనిపోయింది. అయితే వారం రోజులుగా మృత దేహానికి అంత్యక్రియలు జరపలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. కుటుంబ సభ్యులు మాత్రం.. ఏమాత్రం అనుమానం రాకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు. దీంతో మృతదేహం కుళ్లి పోయింది. తీవ్ర దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం ఇంట్లో ఉంచుకున్న కుటుంబ సభ్యులకు మతిస్థిమితం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మణిపూర్‌లో మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు

మణిపూర్‌లో జరిగిన జాతుల ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. ఆ రాష్ట్రంలో మెజారిటీ వర్గమైన మైతీలకు బీజేపీ ప్రభుత్వం ఎస్టీ హోదా కల్పించేందుకు ప్రతిపాదించింది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతోపాటు మే 3న భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో సుమారు 200 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.కాగా, మైతీ, కుకీల అశాంతికి కేంద్ర బిందువైన చురచంద్‌పూర్‌లో జరిగిన ఘర్షణలో వందలాది కుకీలు మరణించారు. చురాచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దులో మైతీ వర్గం ఎక్కువగా నివసించే ప్రాంతంలో సామూహిక ఖననం చేసేందుకు కుకీ సంఘం ప్రయత్నించగా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీలో మృతదేహాలు సుమారు ఎనిమిది నెలలుగా ఉన్నాయి. చివరకు సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకుంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీలో ఉన్న మృతదేహాలను ఇటీవల హెలికాప్టర్ల ద్వారా తరలించారు. భారీ భద్రత మధ్య సామూహిక ఖననం చేశారు.

బస్సులో ప్రయాణిస్తున్న వృద్ద మహిళ అరెస్ట్

ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా 65ఏళ్ల వయస్సులో ఒక వృద్ధ మహిళా పోలీసులకు సవాల్ విసరడం ఎంటి అనుకుంటున్నారా. అవును నిజమే ప్రయాణికురాలిగా నటిస్తూ బస్సుల్లో తిరిగే ఈ వృద్ధురాలిపేరు ముత్యాలమ్మ. వయసు 65 సంవత్సరాలు. సేదతీరాల్సిన వయస్సులో దొంగతనాలు చేస్తూ అటు ఆర్టీసి అధికారులకు ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. వరుస దొంగతనాలు చేస్తూ అటు ప్రయాణికులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేశారు.బస్సులో ప్రయాణికురాలిగా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ఆదమరచి నిద్రపోతున్న వేళ వారి దృష్టి మరిల్చి నగలు డబ్బుతో ఉడాయిస్తున్నారు ముత్యాలమ్మ. దీంతో బంగారం పోయిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బస్సులో ప్రయాణించి తమ వస్తువులను పోగొట్టుకున్న బాధితుల సంఖ్య పోలీసు స్టేషన్ కు క్యూ కట్టారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు ముత్యాలమ్మను అరెస్ట్ చేశారు. ఆమెను విచారణ చేయగా.. మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.భీమవరంకు చెందిన ముత్యాలమ్మ బస్సుల్లో ప్రయాణికుల బంగారమే టార్గెట్‎గా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల వరుసగా బస్సులో దొంగతనాలు జరుగుతుండటంతో నిఘా పెట్టిన పోలీసులు ముత్యాలమ్మను అరెస్ట్ చేశారు. ఆమెపై పెట్టిన కేసులను చూస్తే నివ్వెర పోవాల్సిందే. ముత్యాలమ్మ ఒక్క విజయవాడలోనే కాకుండా 6 జిల్లాల పరిధిలో వందల కొద్ది దొంగతనాలు చేసిందనీ మొత్తం 50కి పైగా కేసులు ఉన్నాయని విచారణలో తేలింది. దీంతో ఆమెను చూసి పోలీసులే అవాక్కయ్యారు.దొంగతనాలు చేసే ముత్యాలమ్మ వృద్ధురాలు కావడం పైగా అమాయకంగా ఉండటంతో దొంగతనం జరిగినా.. దొంగ పక్కనే ఉన్నా.. ప్రయాణికులు ఎవ్వరూ గుర్తించలేరన్న ధీమాతో దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు అనేక దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న ముత్యాలమ్మను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చోరీ కేసులో అనుమానితురాలిగా అదుపులోకి తీసుకోవడంతో మొత్తం దొంగతనాల వ్యవహారం బయటపడింది. ముత్యాలమ్మ దొంగతనాల వ్యవహారం వెలుగులోకి రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు బెజవాడ పోలీసులు. ఇప్పటి వరకు 50కి పైగా కేసులు ఉన్నాయని గుర్తించగా ప్రస్తుతం ఆయా స్టేషన్ల నుంచి ముత్యాలమ్మ గురించి, గతంలో నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. భీమవరంకు చెందిన ముత్యాలమ్మ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూపి లాగే పనిలో ఉన్నారు పోలీసులు. అస్సలు వృద్ధురాలుగా ఉన్న ముత్యాలమ్మ చేసిన దొంగతనాల సొత్తు ఎవరికి ఇచ్చింది. సొత్తు అంతా ఎక్కడికి పోతుంది అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో దారుణం

మెదక్(Medak) జిల్లాలో దారుణం(Brutal murder) చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విచారకర సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత రెండు సంవత్సరాల నుంచి భూమికి సంబంధించిన గొడవలు(Land dispute) జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉపసర్పంచ్ మున్రాతి ఆంజనేయులును తన అన్న సత్యనారాయణ చంపాడు అంటూ బంధువులు గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న రామాయంపేట సీఐ లక్ష్మీబాబు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z