* కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తిన హరీశ్‌రావు
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు భగ్గుమన్నారు.రేవంత్ రెడ్డి దబాయించగానే మైక్ కట్ చేయండం ఏంటి..? మా హక్కులు హరించడం ఏంటి..? అని హరీశ్‌రావు మండిపడ్డారు. మీ పార్టీ లాగా రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు. రాజగోపాల్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆయన విత్ డ్రా చేసుకుంటే మేం రెడీ. పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కోమటిరెడ్డి బ్రదర్సే మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉన్నాను.నేను కామెంట్ చేయలేదు సభా నాయకుడిపై. వారి వైపు నుంచి ఇష్టారీతిగా కామెంట్ చేసినప్పుడు.. నేను వారు బయట చేసిన మాటలను గుర్తు చేశాను. ఇదేదో నేను సొంత వ్యాఖ్యలు చేయలేదు. మా పార్టీ మీద చేసిన కామెంట్స్‌ను విత్ డ్రా చేసుకుంటే నేను రెడీ. సభా సజావుగా నడవాలన్నదే నా అభిప్రాయం. కొత్త ఆరోపణలు చేయలేదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
* ప్రజలను హెచ్చరించిన ప్రధాని
డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి స్పందించారు. కొత్త టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ (Smart India Hackathon) ముగింపు సందర్భంగా విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.‘కొత్త సాంకేతికతతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అవి మానవాళికి అంత ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఆ సాంకేతికతను దుర్వినియోగం చేస్తే.. అతి పెద్ద సమస్యలను సృష్టించగలదు. కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వీడియోలు, చిత్రాలు నిజమైనవిగా కనిపిస్తాయి. అలాంటి వాటిని నిజమని నమ్మేందుకు ముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలి’ అని ప్రధాని మోదీ అన్నారు.కాగా, డీప్‌ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం పలువురు సినీ తారల మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడమే. ప్రముఖ సినీ తారలు రష్మిక మందన్నా (Rashmika Mandanna), కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్ సహా పలువురు స్టార్ తారల ఫేక్ వీడియోలు ఇటీవలే తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలను సృష్టించడానికి కృత్రిమ మేధ (artificial intelligence) ను ఉపయోగించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఇలాంటి వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయన్నారు.
* అంబటిపై వైకాపా నాయకుడి విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేశారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబునుద్దేశించి ముప్పాళ్ల జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైకాపా మాజీ మండల అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి రాంబాబు తీరుపై ఆయన పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో మంగళవారం వైరలైంది. ‘గంతకుతగ్గ బొంత అన్నట్లు మీ తమ్ముడు, మీరు సత్తెనపల్లిలో వెలగబెట్టిన రాచకార్యాలు చాలక మళ్లీ మీ ముఖాలకు పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ కూడానా’ అని ప్రశ్నించారు. ‘మీలో దమ్ము, ధైర్యం, నిజాయతీ ఉంటే మొన్ననే ఖాళీ అయిన సొంత నియోజకవర్గమైన రేపల్లె టికెట్ కావాలని సీఎం జగన్‌ను అడిగి, మీ తమ్ముడికి ఇప్పించుకోవాల్సింది. అప్పుడు మీ గొప్పతనం తెలిసేది. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తానని మీరు చెబుతున్నారు. అసలు మిమ్మల్ని ఎవరడిగారు, పోటీ చేస్తున్నారా, లేదా అని? మీకు మీరే అభద్రతా భావంలో ఉన్నారు. సత్తెనపల్లిలో పరిస్థితేంటో మీ ఆత్మసాక్షికి తెలుసు. మీ ఆలోచనంతా ఒకటే.. గెలిస్తే ఎమ్మెల్యే కావొచ్చు. ఓడిపోతే ఇన్ఛార్జిగా ఉండొచ్చు. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతివాటం చూపించవచ్చనేగా’ అని అంబటి తీరును ఎండగట్టారు.
* తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకం
జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులకు 41కోట్ల 59 లక్షల నగదును.. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమచేశారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
* కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!
మద్యం కుంభకోణం కేసు (liquor policy case)లో ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 21న (గురువారం) ఆయన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కానీ, ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశాలు కన్పించట్లేదు. బుధవారం ఆయన విపాసన కార్యక్రమానికి బయల్దేరారు.కేజ్రీవాల్ ఏటా చలికాలంలో విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈసారి ఎక్కడికి వెళ్లేది ఆయన వెల్లడించలేదు. అయితే, బుధవారం ఆయన విపాసనకు బయల్దేరినట్లు ఆప్ వర్గాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం వరుసగా 10 రోజుల పాటు కొనసాగనుంది. దీంతో గురువారం నాటి ఈడీ విచారణకు ఆయన మళ్లీ గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ ఓసారి ఈడీ విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో తొలుత నవంబరు 2న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. తాజా సమన్లపై ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం విపాసన కార్యక్రమం ముందస్తుగా షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్ అని, అది తెలిసే కుట్రపూరితంగా సమన్లు ఇచ్చారని ఆప్ ఆరోపించింది.కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు సమన్లు అందాయి. అయితే, ఈసారి విచారణకు హాజరైతే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశముందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
* విశాఖ చేరుకున్న చంద్రబాబు బాలకృష్ణ
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం ‘యువగళం- నవశకం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ఈ సభ కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకునేలా వివిధ మార్గాలను నిర్దేశించింది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్నారు.
* కొవిడ్ కొత్త వేరియంట్
కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ బుసలు కొడుతోంది. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. కేరళలో జేఎన్.1 బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.జేఎన్.1 వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. జేఎన్.1ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (variant of interest)గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని వివరించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గత 24 గంటల్లో 341 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో అధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 24 గంటల వ్యవధిలో 292 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కి పెరిగింది. ఇక 24 గంటల్లో మొత్తం మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు.
* భరత్‌ను రాజమండ్రి సిటీకి పంపాలని అధిష్టానం నిర్ణయం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇవాళ కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో క్యాంపు ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఇందులో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి చేరుకున్నారు. క్యాంపు ఆఫీసుకు చేరుకున్నవారిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్‌రెడ్డి, పాతపత్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చేరుకున్నారు. అయితే మార్పులు, చేర్పుల్లో భాగంగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ భరత్‌ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానానికి పంపించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం జగన్ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడు.. ఎవరికి.. సీఎంవో నుంచి సమాచారం వస్తుందోనని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
* తమిళనాడు గవర్నర్ తాజా డిమాండ్
తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. కే పొన్ముడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా డిమాండ్ చేశారు. అక్రమ ఆస్తుల కేసులో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. ఆయనతోపాటు భార్యను గురువారం కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ అంశంలో పొన్ముడి అపీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.కాగా, మంత్రి పొన్ముడి వ్యవహారంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి జోక్యం చేసుకున్నారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని తాజాగా డిమాండ్ చేశారు. మరోవైపు బిల్లులను పెండింగ్‌లో ఉంచడంపై గవర్నర్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం గత నెలలో ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే గవర్నర్, సీఎం కలిసి కూర్చొని పెండింగ్ బిల్లుల విషయంపై చర్చించి పరిష్కరించుకోవాలని తాజాగా సూచించింది.
👉 – Please join our whatsapp channel here –