తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కట్టిందే ఒక్క కాళేళ్వరం ప్రాజెక్ట్.. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కూలిపోయిందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణంగా తెచ్చిన అప్పులకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.
కాగా, అసెంబ్లీలో భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ..‘ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలి అనే ఈ శ్వేతపత్రం. రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ శ్వేతపత్రం. ఇంతా చేసి బయటకు చెప్పకండి.. పరువు పోతుందంటున్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయో అనేది తెలియాలి. ప్రణాళికబద్దంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ముందు పెద్ద సవాల్ ఉంది.
మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదు. ఏ బడ్జెట్‌లోనైనా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుంది. పదేళ్లల్లో ఇన్ని కోట్ల బడ్జెట్‌తో ఏం సాధించారు. కానీ, గత ప్రభుత్వ కాలంలో చాలాసార్లు 20శాతం కంటే ఎక్కువగా బడ్జెట్‌లో గ్యాప్ ఉంది. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించారు. కానీ, అంతా రివర్స్ అయ్యింది. ఆర్థిక పరిస్థితి ఓవైపు.. ప్రజల ఆకాంక్షలు మరోవైపు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కట్టామన్నారు.. ప్రజలందరికీ చూపించారు. మేం వెళ్లి చూస్తామంటే అడ్డుకుని అరెస్ట్ చేశారు. కట్టింది ఒక్కటే ప్రాజెక్ట్ అది కూడా కూలిపోయింది. మిషన్ భగీరథకు కూడా అలాగే చెప్పి అప్పులు తెచ్చారు. ప్రాజెక్ట్ సెఫ్టీ వాళ్లు మేడిగడ్డ మళ్లీ కట్టాలి అన్నారు. ఎల్లింపల్లి కూడా మేం కట్టిందే, దాన్ని కూడా మీరు వాడుకున్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరంలో వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తామని బ్యాంకులకు చెప్పింది.
ఓఆర్‌ఆర్ కట్టింది మేమే.. దాన్ని కూడా అమ్మకానికి పెట్టారు. మీరు చేసిన దివాళా పని సెట్ చేసుకోవడం మాకు కష్టమే. మీరు చాలా స్వేచ్చగా మాట్లాడవచ్చు. మాకు కిరీటాలు వచ్చాయనుకోవడం లేదు. కార్పొరేషన్లు అప్పులు తీర్చవు.. ప్రభుత్వమే అప్పులు తీర్చాలి. రాష్ట్రంపై మీకంటే ఎక్కువ ప్రేమ మాకే ఉంది. రాష్ట్రం ఇచ్చిందే మేము. తెచ్చిన అప్పులతో బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లు కట్టారంటే అది లేదు. కేంద్ర సంస్థలు ఏం తెచ్చారు? వచ్చిన ఐటీఐఆర్‌ను పోగొట్టారు. రెండు ఫామ్‌హౌజ్‌లను మాత్రమే తెచ్చారు. మా వెన్నులో భయం పెట్టుకునే పని చేస్తున్నాం. గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నామా?’ అని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –