రిపబ్లికన్ పార్టీ (Republican Party) రాష్ట్ర ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనపై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కుట్రేనని మండిపడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై రిపబ్లికన్ నేత, అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ పోటీలో లేకపోతే.. తాను కూడా వైదొలుగుతానని ప్రకటించారు.
2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్ ప్రేరేపించిన కారణంగా.. కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారత సంతతి నేత వివేక్ రామస్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ట్రంప్‌ను పోటీ పడేందుకు అనుమతించకపోతే నేను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారు. ఇలాంటి తీర్పుల కారణంగా దేశంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైడెన్.. ప్రజాస్వామ్యానికి ముప్పు: ట్రంప్
‘‘ఎన్నికల పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్, ఆయన సమూహం చేస్తున్న ఇలాంటి విపరీత చర్యలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని తీవ్ర స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు. మేం ఘోరంగా ఓడిస్తామని వారికి తెలుసు. అందుకే.. చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్ మండిపడ్డారు.
వచ్చే ఏడాది మార్చిలో కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టాలని కలలు కంటున్న ట్రంప్‌నకు ఈ తీర్పు గట్టి షాకిచ్చింది. అయితే, దీనిపై తాము అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ట్రంప్ అటార్నీ వెల్లడించింది. తీర్పును సవాల్ చేసేందుకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ట్రంప్‌నకు అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –