హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను (Israel Hamas Conflict) కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో దేశంలో ఏర్పడిన కార్మికుల కొరతను (Construction workers) భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌తో సంప్రదింపులు జరుపుతోన్న నెతన్యాహు ప్రభుత్వం.. డిసెంబర్ చివరి వారంలోనే నియామక ప్రక్రియ (Workers Recruiting) చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ఓ బృందం భారత్ చేరుకోగా.. వచ్చేవారం మరో బృందం రానున్నట్లు తెలిసింది.
‘డిసెంబర్ 27 నుంచి దిల్లీ, చెన్నైలలో కార్మికుల నియామక ప్రక్రియ మొదలుపెడతాం. ప్రభుత్వ ఆమోదం ప్రకారం, తొలుత 10వేల మందిని నియమించుకుంటాం. అనంతరం ఈ సంఖ్యను 30వేలకు పెంచుతాం. ఇది నిరంతర ప్రక్రియ’ అని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి షేయ్ పాజ్‌నర్ వెల్లడించారు. ఈ ప్రక్రియ వచ్చే వారం మొదలై 10-15రోజుల పాటు కొనసాగనుందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు- భారత ప్రధాని మోదీ మధ్య తాజాగా జరిగిన సంభాషణల్లోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.
ఇజ్రాయెల్‌లో పనిచేసే నిర్మాణ కార్మికుల్లో దాదాపు 80వేల మంది వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్లే. మరో 17వేల మంది గాజా ప్రాంతానికి చెందినవారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడితో వారి వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి. చైనా నుంచి 7వేల మంది, తూర్పు ఐరోపా నుంచి మరో 6వేల మంది మాత్రమే ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో అక్కడ కార్మికుల కొరత తీవ్రమైంది.
ఇలా నిర్మాణరంగంతోపాటు ఇతర విభాగాల్లో ఏర్పడిన మానవ వనరుల కొరతను భర్తీ చేసుకునేందుకు గాను దాదాపు లక్షా 60వేల మందిని నియమించుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే అక్కడ 18వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ భాగం నర్సింగ్ విభాగంలోనే ఉన్నారు. భారత్ నుంచి దాదాపు 42 వేల మందిని నియమించుకునేందుకు భారత్-ఇజ్రాయెల్ మధ్య ఈ ఏడాది మేలో ఒప్పందం జరిగింది. వీరిలో 34వేల మంది కార్మికులు కాగా.. 8వేల మంది నర్సింగ్ విభాగంలో ఉండనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z