గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి లోక్సభ స్థానం నుంచి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? మంగళవారం దిల్లీలో నిర్వహించిన ‘ఇండియా’ కూటమి భేటీలోనూ ఇదే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమెను వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేయించాలని టీఎంసీ ఛైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. అయితే, కాంగ్రెస్ నేతల నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. భేటీ అనంతరం ప్రియాంక అభ్యర్థిత్వం గురించి దీదీని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనే వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ స్థానంలో కాంగ్రెస్ మరొకరిని పోటీకి దించింది. అయితే, ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ చురుగ్గా పాల్గొనడంతో మరోసారి ఆమె అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.
👉 – Please join our whatsapp channel here –