Business

భారీగా పడిపోయిన ఉల్లి ధర- వాణిజ్య వార్తలు

భారీగా పడిపోయిన ఉల్లి ధర- వాణిజ్య వార్తలు

భారీగా పడిపోయిన ఉల్లి ధర

రుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి. డిసెంబర్ 7న ఉల్లి ఎగుమతిపై మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీని తర్వాత హోల్‌సేల్ మార్కెట్‌లలో ఉల్లి ధరలు దాదాపు 50శాతం పడిపోయాయి. రానున్న వారాల్లో ధరలు స్థిరంగా ఉంటాయని లేదా స్వల్పంగా తగ్గుతాయని వ్యాపారులు తెలిపారు. లాసల్‌గావ్ AMPC వద్ద ఉల్లి సగటు హోల్‌సేల్ ధర కిలోకు రూ. 20-21కి పెరిగింది. ఎగుమతి నిషేధం విధించబడటానికి ముందు ఇది కిలోకు రూ. 39-40గా ఉండేది.డిసెంబర్ 7 నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఊరట లభించగా, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ఎగుమతి నిషేధం తర్వాత లాసల్‌గావ్, నాసిక్ జిల్లాల్లోని 17 మార్కెట్ కమిటీలలో ఉల్లి ధర తగ్గడం ప్రారంభమైంది. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.1500కి తగ్గింది. అసలు ధర కూడా భరించలేని స్థాయిలో ఉల్లి ధరలు పడిపోతున్నాయి. అందుకే నాసిక్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రైతులు ఉల్లిని ఉచితంగా పంపిణీ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఒక నెల క్రితం కిలో ఉల్లి ధర రూ.35 కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.20 కంటే తక్కువగా ఉంది.రోజుకు సుమారు రూ. 6 నుండి రూ.7 కోట్ల నష్టం
నాసిక్ జిల్లా రైతుల ప్రకారం.. ఉల్లి ధరలు బాగా పడిపోవడంతో రూ. 150 నుండి 200 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో వ్యాపారులు, మార్కెట్ కమిటీలు కూడా భారీగా నష్టపోయాయి. లాసల్‌గావ్ ఎపిఎంసి మార్కెట్‌లో వించూర్, నిఫాద్, యోలా ఇతర మార్కెట్‌లో రోజువారీ వినియోగం 40,000 క్వింటాళ్లు కాగా, నాసిక్ జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో మొత్తం 1.5 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వ ఉంది. ఒక్క లాసల్‌గావ్‌లోనే రైతులు ప్రతిరోజూ దాదాపు రూ.6 నుండి రూ.7 కోట్ల వరకు నష్టపోతున్నారు.

ఈ కంపెనీ ఐపీఓకి 93.40 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే!

రెండు కంపెనీల షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బుధవారం తొలిసారి నమోదయ్యాయి. ఇరు సంస్థలూ లిస్టింగ్‌ వేళ మదుపర్లకు లాభాలను తీసుకొచ్చాయి. డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు 77 శాతం ప్రీమియంతో లిస్ట్‌ కాగా.. ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ షేర్లు 26 శాతం లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.790 ఇష్యూ ధర వద్ద ఐపీఓకి వచ్చింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నేడు ఈ కంపెనీ షేర్లు 77.21 శాతం ప్రీమియంతో రూ.1,400 దగ్గర లిస్టయ్యాయి (DOMS Industries Listing). ఆరంభంలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8,622.14 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు దక్కించుకొన్న మదుపర్లు ఒక లాటు(18 షేర్లు)పై కనీసం రూ.14,220 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వారు లిస్టింగ్‌లోనే ఒక్కో లాట్‌పై రూ.10,980 లాభాన్ని ఆర్జించారు. ఈ కంపెనీ ఐపీఓకి 93.40 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే.మరోవైపు ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ (India Shelter Finance Listing) షేర్లు ఇష్యూ ధర రూ.493తో పోలిస్తే బీఎస్‌ఈలో 24.27 శాతం లాభంతో రూ.612.70 దగ్గర లిస్టయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 26.77 శాతం ప్రీమియంతో రూ.625 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. లిస్టింగ్‌ సమయంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.6,236.26 కోట్లుగా నమోదైంది. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయిన మదుపర్లు 30 షేర్లపై కనీసం రూ.14,790 పెట్టుబడిగా పెట్టారు. ఈ లెక్కన వారు లిస్టింగ్‌లో ఒక్కో లాట్‌పై రూ.3,591 లాభాన్ని పొందారు.

* నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆ తర్వాత అమ్మకాలు పుంజుకోవడంతో చివరి సెషన్‌లో కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 302.90 పాయింట్లు పడిపోయి 21,150.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 577 షేర్లు పురోగమించగా.. 2,721 షేర్లు పతనమయ్యాయి. 57 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, యూపీఎల్, టాటా స్టీల్, కోల్ ఇండియా అత్యధికంగా నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్‌ గ్యాస్, పవర్, రియాల్టీ 2-4 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు మూడు శాతానికిపైగా క్షీణించాయి.

టాటా నుంచి త్వరలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ SUV!

టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. పంచ్ ఈవీ మార్కెట్‌లో సిట్రోయెన్ eC3కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. ఇది బహుశా దేశంలోనే అత్యంత చీపెస్ట్ ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పొచ్చు.. సిట్రోయెన్ eC3 ప్రస్తుతం ధర రూ. 11.61 లక్షలు మొదలుకొని రూ. 12.79 లక్షలుగా నిర్ణయించారు. టాటా పంచ్ దీని కంటే తక్కువ ధరలో అంటే రూ.11 లక్షలలోపు విడుదల చేయాలని భావిస్తుంది.ప్రస్తుత సమాచారం ప్రకారం.. ట్రీగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్‌తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అలాగే, పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో అందించబడింది. ఇందులో అల్లాయ్ వీల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా పంచ్ ఈవీ ఐసీఈ పంచ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆర్కెడ్.ఈవీ (Arcade.ev) యాప్ సూట్‌తో సహా కొన్ని అదనపు ఫీచర్లను పొందుపర్చారు. నెక్సాన్, నెక్సాన్ ఈవీలో కనిపించే విధంగా ప్రకాశవంతమైన టాటా మోటార్స్ లోగోతో కూడిన స్పోక్ స్టీరింగ్ వీల్ అందించబడే అవకాశం ఉంది.ఇది కాకుండా, క్యాబిన్ లోపలి భాగం అప్‌డేట్ చేయబడిన నెక్సాన్ మాదిరిగానే 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో సహా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. టాటా పంచ్ ఈవీ ధర గురించి టాటా కంపెనీ ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఇంధనంతో నడిచే కారుతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో దాదాపు 350 కిలో మీటర్ల ప్రయాణం చేసే అవకాశం ఉంది.

* వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Vodafone Idea Prepaid Plan)ను తీసుకొచ్చింది. తమ కస్టమర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడమే లక్ష్యంగా రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ‘వీఐ మూవీస్‌ అండ్ టీవీ’ పేరిట ఈ టెలికాం కంపెనీ ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.కొత్తగా తీసుకొచ్చిన రూ.202 ప్లాన్‌లో వొడాఫోన్‌ ఐడియా 13కు పైగా ఓటీటీలతో కూడిన ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో లభించే ఓటీటీ సర్వీస్‌లు ఏంటనేది మాత్రం సంస్థ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’లో సోనీలివ్‌, జీ5, డిస్నీ+ హాట్‌స్టార్‌, సన్‌నెక్ట్స్‌, హంగామా, షెమారూమీ వంటి ప్రముఖ ఓటీటీలు ఉంటాయి. ఈ  ప్లాన్‌లో వీటన్నింటినీ ఒక నెల పాటు ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వాయిస్‌ కాలింగ్‌, డేటా వంటి ఇతర ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం గమనార్హం.

బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది. చర్యలు తీసుకున్న బ్యాంకుల్లో మన్మందిర్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పూణేకు చెందిన సన్మిత్ర కో-ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్ మెహసానాకు చెందిన లఖ్వార్ నాగ్రిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొంటాయ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబైకి చెందిన సర్వోదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.ఈ బ్యాంకులకు ఎన్ని లక్షల జరిమానా విధించారు? మన్మందిర్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ రూ.3 లక్షల జరిమానా విధించింది. KYC నిబంధనలను విస్మరించడం, ఖాతాదారుల డిపాజిట్ ఖాతాల గురించి తగిన సమాచారాన్ని నిర్వహించకపోవడం వల్ల బ్యాంక్‌పై ఈ చర్య తీసుకోబడింది. అన్ని బ్యాంకులు KYCని నవీకరించడాన్ని రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరి చేసింది. నిబంధనలను విస్మరించిన బ్యాంకులపై RBI జరిమానా విధిస్తుంది. గుజరాత్‌లోని మెహసానాకు చెందిన లఖ్వార్ నాగ్రిక్ సహకారి బ్యాంకు రుణాలు, అడ్వాన్సుల గురించి సరైన సమాచారం అందించనందుకు RBI రూ.2 లక్షల జరిమానా విధించింది.KYC నిబంధనలను విస్మరించినందుకు కాంటాయ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ. 1 లక్ష జరిమానా కూడా విధించబడింది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు, అలాగే బ్యాంకు డిపాజిట్ ఖాతాకు సంబంధించిన సరైన సమాచారం అందించనందుకు సర్వోదయ సహకారి బ్యాంకు ఖాతాదారుల నుంచి యథేచ్ఛగా జరిమానా వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించారు. డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినందుకు పూణేలోని సన్మిత్ర కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.1 లక్ష జరిమానా విధించబడింది.వివిధ బ్యాంకులపై తీసుకున్న చర్యల గురించి సమాచారం ఇస్తున్నప్పుడు.. బ్యాంకుల పనితీరులో జోక్యం చేసుకోవడం తమ లక్ష్యం కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. నిబంధనలను విస్మరించడం వల్లే ఈ చర్య తీసుకున్నారు. దీనితో పాటు ఇది కస్టమర్లను ప్రభావితం చేయదని, ఈ బ్యాంకులన్నీ సాధారణంగా పని చేస్తాయని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z