ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ అనే లఘు కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. దిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు.
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం కాకులు నుంచీ రోహిణి కథ వరకూ పలు కథలను ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ పేరిట పుస్తకంగా ముద్రించారు. ఒంగోలు కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన.. ఆ తర్వాత తిరుపతి, పుణెల్లోనూ చదివారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేసిన పతంజలి శాస్త్రి.. రాజమండ్రిలో పర్యావరణ సెంటర్‌ను నిర్వహించారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో మరికొన్ని.
👉 – Please join our whatsapp channel here –