ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. మునుపెన్నడూ పార్లమెంట్ నుంచి ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేదని అన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకు వేటు వేశారని దుయ్యబట్టారు. పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్లను ఉద్దేశించి బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ (Congress) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటులో సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్ కాగా మంగళవారం మరో 49 మందిపై వేటువేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది సస్పెండయ్యారు.
ప్రధాని స్పందనకు నాలుగు రోజులా?
డిసెంబర్ 13న పార్లమెంటులో జరిగిన అలజడి సంఘటన క్షమించరానిదని సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. దీన్ని ఎవరూ సమర్థించలేరని తెలిపారు. అయితే, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి మోదీకి (PM Modi) నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఇంత గంభీరమైన విషయంపై ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారని తెలిపారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని విరుచుకుపడ్డారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు.
ఆ యత్నాల్లో ప్రధాని, హోంమంత్రి ముందున్నారు..
జమ్మూకశ్మీర్‌కు సంబంధించి కొన్ని కీలక బిల్లులకు ఈ పార్లమెంట్ సెషన్‌లో ఆమోదం లభించాయని సోనియా గాంధీ (Sonia Gandhi) గుర్తుచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ వంటి దేశభక్తులను కించపరిచేందుకు కొంతమంది చరిత్రను వక్రీకరించి, చారిత్రక వాస్తవాలను కప్పిపెడుతూ నిరంతర దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి యత్నాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి స్వయంగా ముందుంటున్నారని విరుచుకుపడ్డారు. కానీ, తాము ఇలాంటి చర్యలకు బెదరబోమని.. నిజం చెప్పేందుకు నిరంతర పట్టుదలతో కృషి చేస్తామన్నారు.
అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నాం..
మరోవైపు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నిరాశ కలిగించిందని చెప్పేసి ఊరుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే పార్టీ పేలవ ప్రదర్శనపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఓ దశ సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఓటమికి గల కారణాలేంటో విశ్లేషించారని వెల్లడించారు. తాము అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –