తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని.. శ్వేతపత్రంలో అవసరమైన చోట వాటి నివేదికలను ప్రస్తావించినట్లు చెప్పారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. శ్వేతపత్రంపై జరిగిన చర్చలో భాగంగా పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
‘‘రాష్ట్ర నిధుల విషయంలో ఆర్బీఐ రోజూ ఓ నివేదిక ఇస్తుంది. 2014-15లో 300 రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయి. గత పదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవు. వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగులు సకాలంలో వారి లోన్లు, బిల్లులు కట్టలేకపోవడంతో వారిని ఎగవేతదారులుగా బ్యాంకులు చూస్తున్నాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలి. మన కుటుంబసభ్యుడు చేసినా తప్పును తప్పుగా అంగీకరించాలి. ఈ వాస్తవాలు కొందరికి చేదుగా ఉండొచ్చు.. ఇంకొందరికి కళ్లు తెరిపించి ఉండొచ్చు. ప్రజలు అన్నీ గుర్తించారు కాబట్టే.. పదేళ్ల తర్వాత మాకు అధికారం ఇచ్చారు. ఎవరినో కించపరిచేందుకో.. తక్కువ చేసి చూపించేందుకో తీసుకొచ్చింది కాదు ఈ శ్వేతపత్రం. మా రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చింది కాదు ఈ శ్వేతపత్రం. కేవలం వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రజలు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. శ్వేతపత్రాన్ని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –