Politics

దేశానికి హాని కలిగిస్తే వదిలిపెట్టం!

దేశానికి హాని కలిగిస్తే వదిలిపెట్టం!

దేశంలో నేర సంబంధిత చట్టాల్లో తమ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సమూల మార్పులు తీసుకువస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. శిక్షల కంటే న్యాయంపైనే ఇవి (New Criminal laws) ఎక్కువ దృష్టి పెడతాయన్న ఆయన.. వలసవాద భావజాలం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నేర బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) మాట్లాడారు.

‘ఈ కొత్త చట్టాలు శిక్షకంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. వలసవాద మనస్తత్వం, గుర్తుల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాయి. బాధితులకు న్యాయం చేసేవిగా ఉంటాయి. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. వాళ్లని శిక్షించకూడదు. అది వారి భావప్రకటనా స్వేచ్ఛ. దేశానికి హాని కలిగించే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఉగ్రవాదం అనేది అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన. ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన శిక్ష విధించాల్సి ఉంటుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

మూక దాడులకు పాల్పడితే మరణదండనే!
‘కొత్త బిల్లులపై సుదీర్ఘ సంప్రదింపులు జరిపాం. ఇప్పటివరకు 158 సమావేశాలు నిర్వహించాం. చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాను. ప్రతి కామా, ఫుల్‌స్టాప్‌లనూ విడిచిపెట్టకుండా చూశా. ఈ మూడు చట్టాలను రద్దు చేసేవరకూ బ్రిటన్‌ ప్రభుత్వం రూపొందించిన చట్టాలనే అమలు చేస్తున్నాం. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మాజెస్టీ, బ్రిటిష్‌ కింగ్‌డమ్‌, ది క్రౌన్‌, బారిస్టర్‌ అనే ఆంగ్ల పదాలను వాడుతున్నాం. కొత్త చట్టాల ప్రకారం.. మూకదాడులకు పాల్పడితే మరణదండనే. ఉగ్రవాదాన్ని నిర్వచించాం. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల్ని జైల్లో పెట్టిన రాజద్రోహ చట్టాన్ని రద్దు చేశాం’ అని అమిత్‌ షా వివరించారు.

మాట ప్రకారమే రామమందిరం నిర్మాణం
భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజా శ్రేయస్సుకు కొత్త చట్టాలు ప్రాధాన్యత ఇస్తాయని అమిత్‌ షా పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఆ మాట ప్రకారమే రామమందిరం నిర్మిస్తామని, జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని కేంద్ర హోంమంత్రి ఉద్ఘాటించారు. భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), సాక్ష్యాల చట్టం (IEA) స్థానంలో ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత 2023’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత 2023’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లు 2023పై లోక్‌సభలో చర్చ జరిగింది. అనంతరం ఈ మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z