తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి’ అని భట్టీ అన్నారు.
నివేదికను చదివే సమయం కూడా ఇవ్వలేదు : హరీశ్‌రావు
అయితే.. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని.. ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేపట్టే అవకాశం తమకు ఉందని తెలిపారు. సభను హుందాగా నడిపేందుకు భారాస పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదే వేశారు.
👉 – Please join our whatsapp channel here –