అప్పులకు అలవాటు పడిన వైకాపా ప్రభుత్వం.. కొత్త అప్పు పుట్టించడానికి సరికొత్త మార్గాన్ని వెతికింది. నాలుగున్నరేళ్లుగా సీసీ కెమెరాల ప్రాజెక్టును మూలన పడేసి.. ఎన్నికలకు ముందు ఇప్పుడు తెరపైకి తెచ్చింది. దీని కోసం ఏపీ ఫైబర్‌నెట్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) తీసుకునే రూ. 552.7 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న సంస్థ ఎండీ అలా లేఖ రాశారో లేదో.. పట్టుమని 10 రోజులు తిరగకుండానే రుణం తీసుకోడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రుణంగా తీసుకునే మొత్తం ఎస్క్రో ఖాతాలో కాకుండా.. సంస్థ ఖాతాకు జమ కానుంది. ఆ మొత్తాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకే వాడతారా లేక ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తుందా.. అనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల కిందట భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ (బీబీఎన్‌ఎల్) పనుల కోసం రూ. 600 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) నుంచి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ తీసుకుంది. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతిపాదనలో చూపిన లెక్కలే విచిత్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి.. వారి నుంచి జరిమానాలు వసూలు చేసి.. ఆ మొత్తం నుంచి చెల్లిస్తామని సంస్థ పేర్కొనడం గమనార్హం. దీనికోసం పోలీసు, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని.. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరుల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామని మరీ పేర్కొంది. గతంలో హోంశాఖ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల నిర్వహణ ప్రాజెక్టును ప్రభుత్వం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు బదిలీ చేసింది.
ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టు లెక్కలివీ!
రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) తీసుకునే రూ. 552.7 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 959 కోట్లు, వాటి నిర్వహణ సంస్థకు రూ. 5.5 కోట్లు, 13 జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ. 178.2 కోట్లు, థర్డ్‌పార్టీ టెస్టింగ్ ఏజెన్సీ కోసం రూ. 2.4 కోట్లు కలిపి మొత్తం రూ. 1,145.10 కోట్ల ప్రాజెక్టు అమలుకు ప్రతిపాదించింది. అందులో ఇప్పటికే రూ. 926.2 కోట్లతో గుత్తేదారు సంస్థ పనులు నిర్వహించింది. వారికి బిల్లుల రూపేణా చెల్లించిన రూ. 579.7 కోట్లు పోను.. ఇంకా రూ. 346.5 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టు అమలులో జాప్యానికి వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి రూ. 28.4 కోట్లు అవసరం. ప్రాజెక్టులో మిగిలిన పనులు చేపట్టడానికి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది.
బీబీఎన్‌ఎల్ ప్రాజెక్టు పనుల పేరుతో రూ. 600 కోట్ల రుణాన్ని ఆర్‌ఈసీ నుంచి ఫైబర్‌నెట్ సంస్థ తీసుకుంది. ఆర్‌ఈసీ ఇప్పటికే రూ. 300 కోట్లను ఇచ్చింది. ఈ మొత్తంతో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులను సంస్థ నిర్వహిస్తున్న దాఖలా లేదు. కొద్దిరోజుల్లో రెండో విడత మరో రూ. 300 కోట్లు విడుదల కానున్నట్లు ఒక అధికారి తెలిపారు. అభివృద్ధి పనులే జరగకుండా.. రుణాన్ని తీసుకుని ఆ మొత్తాన్ని సంస్థ ఎక్కడికి మళ్లించింది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం సీసీ కెమెరాల నిర్వహణ పేరిట మరో రూ. 552 కోట్లు రుణాన్ని తీసుకోనుంది. ఇప్పటికే సంస్థ ప్రతి నెలా రూ.5 కోట్ల నష్టాల్లో ఉంది.
ఇప్పటికే ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రూ. 300 కోట్ల రుణం, తీసుకోబోతున్న రూ. 852 కోట్లు కలిపి.. మొత్తం రూ. 1,152 కోట్ల కొత్త అప్పులపై వడ్డీల భారం పెరిగి సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉందని ఒక అధికారి పేర్కొన్నారు.