Business

నగరంలో ఎక్కడికైనా చేరుకోవడానికి రూ.20 టిక్కెట్

నగరంలో ఎక్కడికైనా చేరుకోవడానికి రూ.20 టిక్కెట్

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. ఫలక్‌నుమా నుంచి కొనసాగించాలని.., ఎల్‌బీనగర్‌ నుంచి కూడా పొడిగించాలని.. అనేక ప్రతిపాదనలు తెరమీదకు వస్తున్నాయి. ప్రజారవాణా ఎంత పెరిగితే అంత ప్రయోజనం ఉంటుంది. నగర ప్రజలకు సులభమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తి చేస్తే రూ. 20 టిక్కెట్‌తో నగరంలో ఎక్కడ నుంచి అయినా అక్కడకు చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.

రూ. 70 కోట్లు వెచ్చిస్తే చాలు.. ఎంఎంటీఎస్‌ రెండోదశకు ఉన్న అవాంతరాలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. కేవలం రూ. 70 కోట్లు వెచ్చిస్తే.. విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ రెండోదశ కింద రైల్వే లైన్లు వేయడానికి వీలవుతుంది. స్టేషన్ల నిర్మాణాలు.. ఇతరత్రా కలిపితే రూ.100 కోట్లు వెచ్చిస్తే విమానాశ్రయం వరకూ ఎంఎంటీఎస్‌ పరుగులు తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని జంటనగరాల సబర్బన్‌ ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ కోరుతున్నారు.

తక్కువ ఛార్జీలతో ప్రయాణం
విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ వస్తే వేలాది మంది ఉద్యోగులకూ తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పించినట్లవుతుందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రధాన కార్యదర్శి చందు పేర్కొన్నారు.

చర్లపల్లితో ముడిపడిన రెండోదశ
నగర శివార్లలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ డిసెంబరులో, ఎంఎటీఎస్‌ రెండోదశ జనవరి నాటికి పూర్తి అవుతాయని ద.మ. రైల్వే అధికారులు గతంలో ప్రకటించినా.. ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందేనంటున్నారు. మౌలాలి -చర్లపల్లి మధ్య 4, సికింద్రాబాద్‌- మౌలాలి మధ్య రెండు లైన్లు నిర్మించారు. సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ మొత్తం 4 లైన్లు ఉంటే రైల్వే నెట్‌వర్క్‌ స్థాయి పెరుగుతుందని అధికారులు అంటున్నారు. సికింద్రాబాద్‌, బేగంపేట్‌, కాచిగూడ, లింగంపల్లి వివిధ స్టేషన్లకు చేరుకోవడానికి ఎంఎంటీఎస్‌ సర్వీసులు తోడ్పడతాయి. చర్లపల్లి నుంచి ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరించి ఉంది. వీటి కోసం ప్రత్యేకంగా ప్లాట్‌ఫామ్‌లు, రెండు లైన్లు అందుబాటులోకి వచ్చాయి

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z