తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముక అని చెప్పిన ఆయన.. రవాణా, సమాచార రంగాలు మనుగడ సాగించాలంటే విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమన్నారు. విద్యుత్తే రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచిస్తుందని చెప్పారు. విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో), విద్యుత్తు సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లకున్న రూ.81 వేల కోట్ల రుణాలు, రూ.50 వేల కోట్లకుపైగా నష్టాలు, గత తొమ్మిదిన్నరేళ్లలో తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. అనంతరం దీనిపై శాసనసభలో చర్చ ప్రారంభమైంది.
విద్యుత్ నాణ్యత పెంచాం: జగదీశ్‌రెడ్డి
చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014 జూన్ 2నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.44.434 కోట్లు కాగా, రూ.22,423 కోట్ల్ల మేర అప్పులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తులు రూ.1,37, 570 కోట్లు కాగా, అప్పులు రూ.81,516 కోట్లు ఉన్నాయన్నారు. భారాస పాలనలో విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామన్న ఆయన.. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –