తానాలో ఆరోపణలు-ప్రత్యారోపణలతో సేవా సంస్థ పరిధి చెరిగిపోతోందని, నిస్వార్థ నిరాడంబర నాయకులు, సమర్థ నాయకత్వంతో పాటు సంస్కరణలకు ఇది కీలక సమయమని వేమూరి ప్యానెల్ నుండి 2023-27 కాలానికి గానూ బోర్డు సభ్యురాలిగా బరిలో ఉన్న తూనుగుంట్ల శిరీష అభిప్రాయపడ్డారు. తెలంగాణా కొత్తగూడెంకు చెందిన ఆమె న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. 2011 నుండి తానా బలోపేతానికి కృషి చేస్తున్నారు. తానా ఎన్నికల సరళిపై, తన కార్యాచరణపై ఆమె TNIతో ముచ్చటించారు.
తానాలో అనేక పదవులు నిర్వహించిన శిరీష, ఆయా పదవుల్లో శక్తి వంచన లేఖుండా నిజాయితీగా పనిచేశారు. నభూతో అన్న రీతిలో ఎన్నో కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులతో కలిసి సమన్వయపరిచి నిర్వహించి శెభాష్ అనిపించుకున్నారు. తానా చరిత్రలో చరిత్రాత్మకంగా నిలిచిపోయే కార్యక్రమాలౌ ఆమె రూపకల్పన చేసి కార్యరూపాన్నిచ్చారు. మహిళలకు ఆసరాగా నిలిచారు. సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేశారు.
సుదీర్ఘమైన ఎన్నికల కాల వ్యవధి, విపరీతమైన డబ్బు ఖర్చుతో తానా ఆశయాలను నీరు కార్చే విధంగా పరిస్థితి తయారైందని ఆమె విచారం వ్యక్తపరిచారు. సంస్కరణలు చేపట్టవలసిన కీలక సమయం ఇప్పుడేనని, నిరాడంబరత, నిస్వార్ధ నాయకులు గెలిచి పదవులు చేపట్టవలసిన తరుణమిదని ఉద్ఘాటించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కన్నా తానా ప్రతిష్ఠ కోసం పాటుపడే వాళ్ళను ఎన్నుకోవాల్సిన అవకాశం నేడు తానా సభ్యులకు వచ్చిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తన అనుభవాలను మేళవించి సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని, తనకు తానా బోర్డులో సభ్యురాలిగా ఉండేందుకు తానా ఓటర్లు తమ ఓటు ద్వారా తనకు అవకాశం కల్పించాలని కోరారు. బోర్డ్ డైరెక్టర్‌గా గెలిపిస్తే తానా ద్వారా సభ్యులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు తానాకు అనవసరమైన ఖర్చులను తగ్గించి, ఎన్నికల నిర్వహణ సంస్కరణలు చేపట్టి, తానా కార్యకలాపాల్లో పారదర్శకత పెంపొందించే చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, జవాబుదారీతనం పెరిగేలా నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు తనవంతుగా శ్రమిస్తానని శిరీష వెల్లడించారు. తనతోపాటు సతీష్ వేమూరి టీమ్‌ను కూడా గెలిపించాలని ఆమె కోరారు. —సుందరసుందరి(sundarasundari@aol.com)