దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐఎం (IIM)లలో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT) 2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్‌లో మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్‌తో అదరగొట్టారు. నవంబర్ 26న జరిగిన ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 2.88లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కాగా.. మొత్తంగా 14 మంది 100 పర్సంటైల్‌తో మెరిశారు. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు ఉన్నట్లు ఐఐఎం లఖ్‌నవూ వెల్లడించింది.
ఇంజినీరింగ్ అబ్బాయిలదే హవా..
మొత్తంగా 72మంది టాపర్లుగా నిలవగా.. 14మంది విద్యార్థులకు 100 పర్సంటైల్; 29 మందికి 99.99 పర్సంటైల్; 29 మందికి 99.98 పర్సంటైల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. టాపర్లలో ఒకేఒక్క విద్యార్థిని (99.99 పర్సంటైల్) ఉన్నారన్నారు. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులే ఈ పరీక్షలో పైచేయి సాధించినట్లు వెల్లడించారు. 100పర్సంటైల్ సాధించిన వారిలో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నలుగురు ఉండగా.. దిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
నవంబర్ 26న దేశ వ్యాప్తంగా 167 నగరాల్లోని దాదాపు 375 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను ఐఐఎం లఖ్‌నవూ (IIM Lucknow) నిర్వహించింది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 3.28 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. 2.88 లక్షల మందికి పైగా విద్యార్థులు (దాదాపు 88శాతం మంది) పరీక్షకు హాజరయ్యారు. డిసెంబర్ 5న ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం తాజాగా తుది కీ, ఫలితాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో ఐఐఎంలు పర్సనల్ ఇంటర్వ్యూలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నాయి. అదే సమయంలో ఇతర ఎంబీఏ కాలేజీలు సైతం అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నాయి. దేశ వ్యాప్తంగా వున్న 21 ఐఐఎంలు, ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు క్యాట్‌లో మంచి స్కోరు సాధించడం తప్పనిసరి. ఈ స్కోరు ఆధారంగా సీట్ల కేటాయింపులు జరుపుతారు. దేశంలో 91 నాన్ ఐఐఎం విద్యా సంస్థలు సైతం ఈ స్కోరును పరిగణనలోకి ప్రవేశాలు కల్పించనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –