రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఈనెల 24న కీలక సమావేశం నిర్వహించనున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలు ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశముంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారమే సీఎం సమీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ శాసనసభ సమావేశాల వల్ల వాయిదా పడింది. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు ప్రజా వాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కలెక్టర్ల సదస్సులో నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పేరుతో రూ.5లక్షల ఆర్థికసాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –