ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యకర్త యశస్వి (యష్) బొద్దులూరి అరెస్టును తెదేపా నేతలు ఖండించారు. అరెస్టుకు నిరసనగా గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదిని హింసించినట్లు యష్‌తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ‘‘యష్ అరెస్టును ఖండిస్తున్నా. ప్రశ్నించే గొంతులను నిర్బంధాల ద్వారా అణిచివేయాలని వైకాపా ప్రభుత్వం అనుకుంటోంది. న్యాయం జరిగే వరకు విశ్రమించబోము. వైకాపాకి చివరి రోజులు దగ్గర పడ్డాయి’’ అని లోకేశ్ మండిపడ్డారు.
యష్‌ను అరెస్టు చేయడం సైకోయిజానికి నిదర్శనమని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ తప్పులు, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘ స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు లేదా?జగన్ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించక తప్పదు’’ అని అన్నారు.
అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూస్తున్నారని చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. వైకాపా ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. యశస్విని ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని మంగళగిరి తరలించారు. 41ఏ సీఆర్పీసీ కింద యష్‌కు నోటీసులిచ్చారు. 2024 జనవరి 11న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –